Pinnelli Ramakrishna Reddy: అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వస్తున్న వార్తలపై స్పందించిన పిన్నెల్లి
- మాచర్లలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు
- కారంపూడి ఘటనల తర్వాత కనిపించకుండా పోయిన పిన్నెల్లి, ఆయన సోదరుడు
- గన్ మన్లను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ప్రచారం
- తాను వ్యక్తిగత పనుల మీద హైదరాబాదులో ఉన్నానని పిన్నెల్లి స్పష్టీకరణ
పోలింగ్ అనంతరం హింస, తదితర పరిణామాల నేపథ్యంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గృహ నిర్బంధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. గన్ మన్లను కూడా వదిలేసి వెళ్లిపోయినట్టు ప్రచారం జరిగింది.
కారంపూడి ఘటనల తర్వాత పిన్నెల్లి సోదరులు ఇద్దరూ కనిపించకుండా పోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. అయితే, ఈ వార్తలపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు.
తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత పనుల మీద హైదరాబాదులో ఉన్నానని వెల్లడించారు. ఎటో వెళ్లిపోవాల్సిన అవసరం తనకు లేదని పిన్నెల్లి పేర్కొన్నారు. అజ్ఞాతంలోకి వెళ్లానంటూ తనపై జరుగుతున్నది దుష్ప్రచారం అంటూ ఖండించారు.