Cybercrime: మహిళతో రాత్రంతా వీడియోకాల్ మాట్లాడుతూ రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్న సైబర్ మోసగాడు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్!

Cyber Criminal Cheated Hyderabad Woman For Rs 60 Lakhs

  • తనను తాను మహారాష్ట్ర పోలీసుగా పరిచయం చేసుకున్న నిందితుడు
  • మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారని, అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని బెదిరింపు
  • రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాక కానీ వదలని నేరగాడు
  • 1930కి కాల్ చేయడంతో బయటపడిన మహిళ

సైబర్ నేరగాళ్లు మరీ బరితెగించిపోతున్నారు. ఓ మహిళకు ఫోన్ చేసి బెదిరించిన మోసగాడు.. రాత్రంతా ఆమెతో వీడియోకాల్‌లో మాట్లాడుతూ ఏకంగా రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. ఆపై మోసపోయానని భావించిన బాధితురాలు అప్రమత్తం కావడంతో డబ్బులు బదిలీ కాకుండా ఆగిపోయాయి.  

హైదరాబాద్‌కు చెందిన మహిళకు ఈ నెల 15న రాత్రి గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తనను తాను మహారాష్ట్ర పోలీసుగా పరిచయం చేసుకున్న అతడు.. మీరు మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని, అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని చెప్పడంతో ఆమె వణికిపోయింది. తనను రక్షించాలని కోరింది. దీంతో అతడు మరింతగా రెచ్చిపోయాడు. స్కైప్‌లో వీడియోకాల్ చేసిన నిందితుడు రాత్రంతా ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఉదయం బ్యాంకులు తెరిచే వేళ వరకు ఆమెతో మాట్లాడుతూనే ఉన్న నిందితుడు.. ఆమెను బ్యాంకుకు పంపి రూ. 60 లక్షలు తన ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.

క్షణాల్లోనే అప్రమత్తమైన సీఎస్‌బీ
డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత మోసపోయినట్టు గుర్తించిన బాధితురాలు వెంటనే 1930కి ఫోన్ చేసి విషయం చెప్పి ఫిర్యాదుచేశారు. అప్రమత్తమైన సీఎస్‌బీ బృందం ఆమె లావాదేవీల వివరాలను సిటిజన్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టం (సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎంఎస్)లో నమోదు చేయించారు. ఎస్‌బీఐ ఖాతాలకు అప్పటికే నగదు బదిలీ కావడంతో బ్యాంకు ప్రతినిధులను అప్రమత్తం చేసి ఆయా ఖాతాల నుంచి నగదును ఉపసంహరించకుండా లాక్ చేయించారు. ఈ వ్యవహారం మొత్తం గంటలోపే ముగిసింది. పోయిందనుకున్న మొత్తం వెనక్కి రావడంతో బాధితురాలు ఊపిరిపీల్చుకుంది. పోలీసులు ఎవరూ ఇలా వీడియోకాల్ చేసి డబ్బులు అడగరని, అలాంటి కాల్స్ వస్తే 1930కి ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.

  • Loading...

More Telugu News