Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్‌?.. గౌతీలో బీసీసీఐ చ‌ర్చ‌లు!

BCCI Approaches Gautam Gambhir to Replace Rahul Dravid as India Head Coach

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024తో ముగుస్తున్న ప్రస్తుత కోచ్ ద్రావిడ్ ప‌ద‌వీకాలం
  • ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల హెడ్ కోచ్ పోస్టుకు బీసీసీఐ ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానం
  • ఈ క్ర‌మంలో ఇప్పుడు కోచ్ రేసులో తెర‌పైకి భార‌త మాజీ ఆట‌గాడు గౌతం గంభీర్ పేరు

భార‌త క్రికెట్ సీనియ‌ర్ పురుషుల జ‌ట్టు హెడ్ కోచ్ పోస్టుకు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ఇటీవ‌ల‌ ద‌ర‌ఖాస్తుల్ని ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు గ‌త సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం టీమిండియా కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ప‌ద‌వీకాలం 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌తో ముగుస్తుంది. అంటే జూన్ చివ‌రి నాటికి ద్రావిడ్ కోచ్‌గా వైదొలుగుతారు. అందుకే కొత్త కోచ్ కోసం బీసీసీఐ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు కోచ్ రేసులో కొత్త పేరు తెర‌పైకి వ‌చ్చింది. అత‌డు మ‌రెవ‌రో కాదు. భారత జట్టు మాజీ ఆటగాడు, ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ (కేకేఆర్‌) కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్‌. 

గంభీర్‌ టీమిండియాకు తదుపరి హెడ్‌కోచ్‌గా రాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీసీసీఐ సైతం రాహుల్ ద్రావిడ్‌ వారసత్వాన్ని గౌతీకి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బోర్డు వర్గాల సమాచారం. ఇదే విషయమై గంభీర్‌తో బీసీసీఐ ప్రతినిధి ఒకరు చర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. అలాగే అతడిని కోచ్‌ పదవికి దరఖాస్తు చేసే విధంగా మంతనాలు జరిపినట్టు విశ్వసనీయ వర్గాల స‌మాచారం.

ఇక ‘మెన్‌ ఇన్‌ బ్లూ’కు హెడ్‌కోచ్‌ రేసులో ఫ్లెమింగ్‌, లాంగర్‌, పాంటింగ్‌, నెహ్రా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. భారత్‌ గెలిచిన రెండు ఐసీసీ ట్రోఫీ (2007, 2011) లలో భాగమైన గౌతం గంభీర్‌కు ఇప్పటిదాకా కోచ్‌గా పనిచేసిన అనుభవం లేదు. ఐపీఎల్‌లో అతడు 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించి ఈ సీజన్‌లో ఆ బాధ్యతను కేకేఆర్‌కు నిర్వర్తిస్తున్నాడు. హెడ్‌కోచ్‌ పదవికి ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఈ నెల 27 ఆఖరి గడువు కాగా అప్పట్లోగా గౌతీ ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.

కాగా, కొత్త కోచ్ ప‌ద‌వీకాలం ఈ ఏడాది జులై 1 నుంచి 2027 డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు ఉంటుంద‌ని బీసీసీఐ ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అంటే టీమిండియాకు కొత్త‌గా కోచ్ ప‌ద‌వికి ఎంపిక‌యిన వ్య‌క్తి 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు భార‌త జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్‌గా కొన‌సాగుతాడు. ఇక కోచ్ ఎంపిక ప్రక్రియలో దరఖాస్తుల సమగ్ర సమీక్ష, అభ్యర్థుల షార్ట్‌లిస్ట్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటాయి.

ఇదిలాఉంటే.. గౌతం గంభీర్ మెంటర్‌షిప్‌లో కోల్‌క‌తా జ‌ట్టు ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు కేకేఆర్‌ 13 మ్యాచ్‌లలో 9 గెలిచింది. దీంతో 19 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌లో నిలిచింది. అలాగే నెట్ ర‌న్‌రేట్ కూడా +1.428 కలిగి ఉంది. కోల్‌కతా ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) తో జరిగిన మూడు మ్యాచ్‌లలో మాత్ర‌మే ఓడింది.

  • Loading...

More Telugu News