Priyanka Gandhi: రాముడిని తలుచుకుంటూ ప్రాణాలు విడిచిన గాంధీ అనుచరులం: ప్రియాంక గాంధీ

Congress Follows Mahatma Gandhi Who Said Hey Ram Before Dying Says Priyanka Gandhi
  • కాంగ్రెస్ పార్టీ హిందూ మతానికి వ్యతిరేకమంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టిన ప్రియాంక
  • హిందూ చాంపియన్లమని చెప్పుకుంటున్న బీజేపీ పాలనలో గోశాలల పరిస్థితి దయనీయంగా ఉందని విమర్శలు
  • రామ మందిరం ప్రారంభోత్సవానికి హాజరుకాకుంటే హిందువులం కామా? అన్న ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. రామ మందిరం ప్రారంభోత్సవానికి రానివాళ్లంతా హిందువులు కానట్టేనా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఆఖరి క్షణంలో రాముడిని తలుచుకుంటూ (హేరామ్) అంటూ కన్నుమూసిన గాంధీజీ అనుచరులమని ప్రియాంక గాంధీ చెప్పారు. అలాంటి మమ్మల్ని హిందూ వ్యతిరేకులంటూ మోదీ ఆరోపించడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగారు. ఈమేరకు రాయ్ బరేలీలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
తమని తాము హిందూ చాంపియన్లమని బీజేపీ వాళ్లు చెప్పుకుంటారని ప్రియాంక గుర్తుచేశారు. అలాంటి పార్టీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ లో చాలా గోశాలల పరిస్థితి దయనీయంగా ఉందని, కొన్నిచోట్ల గోమాత కళేబరాలను కుక్కలు పీక్కుతింటున్నాయని ఆరోపించారు. హిందూ వ్యతిరేకులమని మోదీ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఛత్తీస్ గఢ్ లో అధికారంలో ఉన్నపుడు గోశాలల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని గుర్తుచేశారు. పొదుపు సంఘాల మహిళల నుంచి ఆవు పేడను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిందని, తద్వారా వారిని గోవుల పెంపకం దిశగా ప్రోత్సహించిందని ప్రియాంక చెప్పారు.

రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్న సోదరుడు రాహుల్ గాంధీని గెలిపించాలంటూ ప్రియాంక గాంధీ నిత్యం ప్రచారం చేస్తున్నారు. తమ నానమ్మ ఇందిరా గాంధీ, నాన్న రాజీవ్ గాంధీల కాలం నుంచే తమకు రాయ్ బరేలీతో గట్టి అనుబంధం ఉందని గుర్తుచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందాక రాహుల్ గాంధీ కూడా సంప్రదాయాలను పాటిస్తారని చెప్పుకొచ్చారు. ఇక, మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన రైట్ టు ఫుడ్ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పంపిణీ చేస్తోందని చెప్పారు.

అయితే, మోదీ మాత్రం ఈ క్రెడిట్ తనదే అన్నట్లు రేషన్ షాపుల్లో తన ఫొటో పెట్టుకుంటున్నాడని విమర్శించారు. యూపీలో నియామక పరీక్షల పేపర్ లీక్ ఘటనలను ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేపర్ లీక్ లను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకొస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యపై జీఎస్టీని ఎత్తివేస్తామని, అగ్నివీర్ స్కీమ్ ను రద్దు చేస్తామని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
Priyanka Gandhi
Raibareli
Lok Sabha Polls
Rahul Gandhi
Congress
anti hindu
Cow Sheds
Uttar Pradesh

More Telugu News