Dasoju Sravan: ప్రజలపై పన్నుల భారం మోపి, పదవీ కాలం పెంచుకోవాలని కుట్ర: తెలంగాణ సీఎంపై దాసోజు ఫైర్​

BRS Leader Dasoju Shravan Fires on CM Revanth Reddy
  • ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చారని మండిపాటు
  • వాటిని అమలు చేసేందుకు పన్నులు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపణ
  • భూముల మార్కెట్ ధరల సవరణ ఆలోచన సరికాదని హితవు
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా అలవికాని హామీలిచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయడానికి ప్రజలపై పన్నుల భారం మోపేందుకు సిద్ధపడుతున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తన పదవీ కాలం పెంచుకోవడానికి పన్నులు హెచ్చించి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. భూముల మార్కెట్ ధరలు సవరించాలనే ఆలోచన మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డి విధానాన్ని ఎదిరించాలంటూ ట్విట్టర్ ద్వారా దాసోజు ప్రజలకు పిలుపునిచ్చారు.

అవగాహనలేమి, అధికార దాహం.. రేవంత్ రెడ్డి నోటి వెంట ఆచరణలో సాధ్యం కాని హామీలను కురిపించేలా చేసిందని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టడంతో ప్రస్తుతం ఆ హామీలను నిలబెట్టుకోవడానికి దిక్కుమాలిన ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా భూముల ధరలు పెంచి ఖజానా నింపాలని అధికార యంత్రాంగాన్ని నిరంకుశంగా ఆదేశించారని మండిపడ్డారు.
Dasoju Sravan
BRS
CM Revanth Reddy
Congress Govt
Taxes
Land rates
Dasoju Tweet

More Telugu News