Jeevan Reddy: రాజీవ్ గాంధీ బతికి ఉంటే రామాలయ నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేది: జీవన్ రెడ్డి

Jeevan Reddy says Ram Mandhir would completed many years ago
  • శిలాన్యాస్ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్న జీవన్ రెడ్డి
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని మోదీ ప్రచారం చేయడం దారుణమని వ్యాఖ్య
  • మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న జీవన్ రెడ్డి
  • ప్రధాని మోదీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
రాజీవ్ గాంధీ బ్రతికి ఉంటే అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎప్పుడో జరిగి ఉండేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే శిలాన్యాస్ జరిగిందని వెల్లడించారు. మోదీ వచ్చాడు కాబట్టే దేవాలయం పూర్తయిందని చెప్పడం సరికాదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శిలాన్యాస్ ఎప్పుడు జరిగింది? అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలోనే వీహెచ్‌పీ శిలాన్యాస్ చేసిందని తెలిపారు.

 కానీ కాంగ్రెస్ పార్టీ వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని ప్రధాని మోదీ ప్రచారం చేయడం దారుణమన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రధాని మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్ గాంధీ అని తెలిపారు. ఎన్నికల కోసం దేవుడిని వాడుకోవడం సరికాదన్నారు. మతసామరస్యానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.

లౌకికవాదం అంటే ఒక మతానికి పరిమితం కాదని... అన్ని మతాలకు వర్తిస్తుందన్నారు. అన్ని మతాలతో పాటు హిందువుల మనోభావాలను గౌరవించాలన్నారు. శ్రీరామచంద్రుడి పాలనను రాజీవ్ గాంధీ ఆదర్శంగా తీసుకున్నారని తెలిపారు. హిందువుల మనోభావాలను, సంప్రదాయాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. రామాలయ నిర్మాణం జరగడానికి కారణం న్యాయస్థానం తీర్పే అన్నారు. ఈరోజు మోదీ న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ముందుకు సాగారని జీవన్ రెడ్డి అన్నారు.
Jeevan Reddy
Congress
Narendra Modi
Telangana

More Telugu News