Palnadu District: పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలపై భారీగా కేసుల నమోదు... వివరాలు ఇవిగో!
- పల్నాడు జిల్లాలో పోలింగ్ నేపథ్యంలో భారీగా అల్లర్లు
- కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
- ఒక్క గురజాల నియోజకవర్గంలోనే 100 కేసులు... ఎఫ్ఐఆర్ లో 192 పేర్లు
- కారంపూడి ఘటనల్లో 11 మంది వైసీపీ, 8 మంది టీడీపీ నేతల అరెస్ట్
పల్నాడు జిల్లాలో పోలింగ్ నేపథ్యంలో జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు భారీ సంఖ్యలో కేసులు నమోదు చేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్రంలో అల్లర్లపై సిట్ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో, ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు వైసీపీ, టీడీపీ ఇరుపక్షాల వారిపై కేసులు నమోదు చేయడమే కాదు, కొందరిని అరెస్ట్ చేశారు.
ఒక్క గురజాల నియోజకవర్గంలోనే 100 కేసులు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ లో 192 మంది పేర్లు చేర్చారు. దాచేపల్లి మండలంలో 70, పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు నమోదు చేసిన పోలీసులు, 70 మంది నిందితులను గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదు కేసులు నమోదు చేసిన పోలీసులు, 99 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేట నియోజకవర్గంలో 20 కేసులు నమోదు చేసిన పోలీసులు, 60 మంది నిందితులను ఎఫ్ఐఆర్ లో చేర్చారు.
నరసరావుపేటలో జరిగిన దాడుల్లో 11 మందిపై ఐపీసీ 147, 148, 324 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దాడులు, ఘర్షణల వీడియోలు పరిశీలించి నిందితులను గుర్తిస్తున్నారు. మరింత ఫుటేజి అందుబాటులోకి వస్తే ఎఫ్ఐఆర్ లలో మరికొందరి పేర్లు చేర్చే అవకాశం ఉంది.
ఇక, అత్యంత సమస్యాత్మక మాచర్ల నియోజకవర్గం కారంపూడి ఘటనలకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. వైసీపీకి చెందిన 11 మందిని, టీడీపీకి చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పల్నాడు ఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిట్ బృందం విచారణ షురూ చేస్తోంది.