Priyanka Gandhi: తాను ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పిన ప్రియాంక గాంధీ
- దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంపై దృష్టి సారించినందునే పోటీకి దూరంగా ఉన్నట్లు వెల్లడి
- రాహుల్ గాంధీతో పాటు తానూ పోటీ చేస్తే బీజేపీకి లబ్ధి చేకూరుతుందన్న ప్రియాంక
- అమేథి, రాయ్‌బరేలీలను కాంగ్రెస్ వదిలి పెట్టదన్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు
లోక్ సభ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయడం లేదు? అనే విషయమై ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ స్పందించారు. దేశవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రచారం చేయడంపై దృష్టి సారించానని... అందుకే పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... రాహుల్ గాంధీతో పాటు తానూ పోటీ చేస్తే బీజేపీకి లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.
'నేను గత పదిహేను రోజులుగా రాయ్‌బరేలిలో ప్రచారం చేస్తున్నాను. గాంధీ కుటుంబానికి రాయబరేలీతో ఎంతో అనుబంధం ఉంది. మేం రాయ్‌బరేలీకి వచ్చి వారితో మాట్లాడాలని ప్రజలు భావిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఎన్నికలను గెలవలేమ'ని ప్రియాంక గాంధీ అన్నారు.
రాహుల్, తాను... ఇద్దరం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, కనీసం 15 రోజులు తమ నియోజక వర్గాల్లో ప్రచారానికి సమయం కేటాయించాల్సి ఉంటుందన్నారు. అప్పుడు దేశమంతటా ప్రచారం చేయడం కుదరదని తాము భావించినట్లు చెప్పారు. అయితే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. ఎన్నికల్లో పోటీ చేయాలని తానెప్పుడూ అనుకోలేదన్నారు. అయితే పార్టీ కోసం వారు ఏం చేయమంటే అది చేస్తానని, తాను ఎన్నికల్లో పోరాడాలని ప్రజలు భావిస్తే పోటీ చేస్తానన్నారు.
అమేథి, రాయ్‌బరేలీల నుంచి గాంధీ కుటుంబం పారిపోతుందన్న బీజేపీ నేతల విమర్శలను ప్రియాంక గాంధీ కొట్టిపారేశారు. ఈ నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వదిలిపెట్టదన్నారు. కాంగ్రెస్ కు, ఈ రెండు నియోజకవర్గాలకు మధ్య సంబంధాలు భిన్నమైనవని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని వడోదరలో మోదీ ఎందుకు పోటీ చేయడం లేదు? అని ఆమె ప్రశ్నించారు. అంటే మోదీ భయపడుతున్నారా? చెప్పాలన్నారు. అలా అయితే ఆయన గుజరాత్ నుంచి పారిపోయినట్లు అవుతుందన్నారు.