IPL 2024: అర్ధరాత్రి బెంగళూరు రోడ్లపై ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు
- వీధుల్లో వేలాది మంది కేరింతలు
- ఆర్సీబీ జెండాలు చేతపట్టుకొని డ్యాన్సులు
- ప్లేయర్ల బస్సు స్టేడియం నుంచి తిరిగి హోటల్ కు వెళ్తుండగా వేలాది మంది నీరాజనాలు
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు
చెన్నై సూపర్ కింగ్స్ పై అసాధారణ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2024లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.
ఆడిన తొలి 8 మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న స్థితి నుంచి ఆ తర్వాత వరుసగా ఆరో మ్యాచ్ గెలవడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. శనివారం రాత్రంతా బెంగళూరు రోడ్లపై కేరింతలు కొట్టారు. నగరం నడిబొడ్డున ప్రధాన రహదారిని పూర్తిగా దిగ్బంధించారు.
కొందరైతే రోడ్డుపై ఆర్సీబీ జెండాలు చేతపట్టుకొని వాహనదారులను ఆపుతూ డ్యాన్సులు చేశారు. ఇంకొందరైతే ఆనందం పట్టలేక కార్లపైకెక్కి స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
మరోవైపు మ్యాచ్ ముగిశాక అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ఆర్సీబీ జట్టు బస్సులో హోటల్ కు తిరిగి వెళ్తుండగా స్టేడియం వెలుపల వేలాది మంది అభిమానులు రోడ్డుకు ఇరువైపులా నిలబడ్డారు. ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ నినాదాలు చేశారు.
ఈ వీడియోను ఆర్సీబీ జట్టు తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది తమకు ఎంతో ప్రత్యేకమైన సందర్భమని పేర్కొంది. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ అభిమానులు తమ సొంతమని తెలిపింది. ఇది తమకు ఎంతో గర్వకారణమని కామెంట్ చేసింది. ప్లే బోల్డ్, నమ్మ ఆర్సీబీ అంటూ హ్యాష్ ట్యాగ్ లను జత చేసింది.