5th Phase Polling: మరి కాసేపట్లో 5వ దశ పోలింగ్ ప్రారంభం!

 Voting to begin shortly  all eyes on Amethi Raebareli

  • 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్
  • బరిలో నిలిచిన 695 మంది అభ్యర్థులు, 8.95 కోట్ల మంది ఓటర్లు
  • రాహుల్ గాంధీ, రాజ్‌నాథ్ సింగ్ సహా బరిలో పలువురు ప్రముఖులు

మరి కాసేపట్లో దేశంలో ఐదవ దశ పోలింగ్ ప్రారంభం కానుంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తలపడుతున్నారు. మొత్తం 695 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. ఈ దశలో ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు కాగా ఇందులో మహిళలు 4.26 కోట్లుగా ఉన్నారు. గత నాలుగు దశల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవడంతో ఆందోళన చెందిన ఈసీ ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చింది. 

ఈ దశలో మహారాష్ట్రలో 13 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 14 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 7 సీట్లు, బీహార్‌లో 5 సీట్లు, ఝార్ఖండ్‌లో 3 సీట్లు, ఒడిశాలో 5 సీట్లు, జమ్మూకశ్మీర్, లడఖ్ లలో ఒక్కొక్క సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. 

ఎన్నికల బరిలోని ప్రముఖులు వీరే 
మహారాష్ట్రలో ఉత్తర ముంబై నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి పియూష్ గోయల్, డిండోరీ నుంచి భారతీ పవార్, ముంబై నార్త్‌ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికమ్ బరిలో నిలిచారు. 

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతీ ఇరానీ, ఫతేపూర్ నుంచి సాధ్వీ నిరంజన్ జ్యోతి, మోహన్‌లాల్ గంజ్ నుంచి కౌషల్ కిషోర్ పోటీ పడుతున్నారు. 

బీహార్‌లోని హజీపూర్ నుంచి చిరాగ్ పాశ్వాన్, శరన్ నుంచి రాజీవ్ ప్రతాప్ రూడీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

పశ్చిమబెంగాల్‌లోని బరాక్ పూర్ నుంచి బీజేపీ నేత అర్జున్ సింగ్, హుగ్లీ నుంచి లాకెట్ ఛటర్జీ, సేరంపూర్ నుంచి కల్యాణ్ బెనర్జీ బరిలో ఉన్నారు. 

ఒడిశాలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేడీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బరిలో నిలిచారు. 

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా సీటు నుంచి ఒమర్ అబ్దుల్లా, సాజద్ లోన్, ఫయాజ్ అహ్మద్ మీర్ పోటీ పడుతున్నారు. 

కీలక నియోజకవర్గాలు ఇవే
యూపీలోని అమేథీలో బీజేపీ నేత స్మృతీ ఇరానీ కాంగ్రెస్‌కు చెందిన ఎల్‌కే శర్మతో పోటీ పడుతున్నారు. రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ, బీజేపీ నేత దినేశ్ ప్రతాప్ సింగ్‌తో తలపడుతున్నారు. రాజ్‌నాథ్ సింగ్, ఎస్పీ నేత రవిదాస్ మెహ్రోత్రా కూడా పరస్పరం తలపడుతున్నారు. 

బీహార్లో చిరాగ్ పాశ్వాన్ హాజీపూర్‌లో ఆర్జేడీ నేత శివ్ చంద్రరామ్‌తో పోటీపడుతున్నారు. శరన్‌లో బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ, రోహిణీ ఆచార్యతో బరిలో నిలిచారు. 

గత నాలుగు దశల్లో పోలింగ్ శాతం 66.95గా నమోదైంది. 45.1 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 379 సీట్లలో పోలింగ్ పూర్తయ్యింది. ఇక ఆరవ, ఏడవ దశ ఎన్నికలు వరుసగా మే 25, జూన్ 1న జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.

  • Loading...

More Telugu News