Arvind Kejriwal: త్వరలో మంచి రోజులు... మోదీజీ ఇంటికి వెళ్లే రోజులు వచ్చాయి: అరవింద్ కేజ్రీవాల్

Kejriwal says acche din aane waale hain Modi ji jane waale hain
  • ఢిల్లీలోని గాంధీ నగర్‌లో భార్యతో కలిసి కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న కేజ్రీవాల్
  • తాను జైల్లో ఉన్నప్పుడు అన్నీ తానే చూసుకుందంటూ ఝాన్సీరాణితో పోల్చిన ఢిల్లీ సీఎం
  • జూన్ 4న ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం
త్వరలో 'మంచి రోజులు వస్తున్నాయి... మోదీజీ ఇంటికి వెళ్లే రోజులు వచ్చాయ'ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సోమవారం తన భార్య సునీతా కేజ్రీవాల్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకున్నదని చెబుతూ ఆమెను ఝాన్సీరాణిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ... లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని మోదీ సారథ్యంలోని ఎన్డీయేకు భంగ‌పాటు త‌ప్ప‌ద‌న్నారు. జూన్ 4న కేంద్రంలో విప‌క్ష ఇండియా కూట‌మి అధికారం చేప‌డుతుంద‌ని, అందులో ఆమ్ ఆద్మీ భాగ‌స్వామ్య పార్టీగా ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

విప‌క్ష కూట‌మి అధికారంలోకి వ‌స్తే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. తాము ఢిల్లీలో పాఠ‌శాల‌లు, ఆసుపత్రులను మెరుగుప‌రిచామ‌న్నారు. శాంతిభ‌ద్ర‌త‌లు మాత్రం దారుణంగా ఉన్నాయ‌ని, లెఫ్టినెంట్ గవర్నర్ క‌నుస‌న్న‌ల్లో న‌డిచే ఢిల్లీ పోలీసులు త‌మ మాట విన‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయితే జూన్ 4 త‌ర్వాత ఢిల్లీ పోలీసులు ప్ర‌జ‌ల మాట‌కు త‌ల‌వంచ‌క త‌ప్ప‌ద‌ని వ్యాఖ్యానించారు.

'ఈరోజు సునీత కూడా నా వెంట ఉంది. నేను ఇక్కడ లేనప్పుడు అన్నీ ఆమే చూసుకుంది. జైల్లో ఉన్నప్పుడు నన్ను కలవడానికి వచ్చేది. ఆమె ద్వారా నా ఢిల్లీవాసుల యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడిని. సందేశాలను ఆమె ద్వారా పంపించేవాడిని. ఈమె ఝాన్సీరాణి వంటి వారు' అని ఢిల్లీలోని గాంధీ నగర్ నియోజకవర్గంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో అన్నారు.
Arvind Kejriwal
Narendra Modi
Lok Sabha Polls
New Delhi

More Telugu News