G. Kishan Reddy: అదే జగన్‌ను ఓడిస్తుంది: ఏపీ రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- జగన్ ఇచ్చిన ఉచితాలకు ఆయన ఇంట్లో కూర్చున్నా గెలవాలి... అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
- కానీ, అహంకారమే జగన్‌ను ఓడిస్తుందని విమర్శలు
- ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా
జగన్ ఇచ్చిన ఉచిత పథకాలకు ఆయన ఇంట్లో కూర్చున్నా చాలు... గెలవాలి... కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అనేక పథకాలు ఇచ్చినప్పటికీ గెలిచే పరిస్థితి లేదన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఓడించినట్లే.. జగన్ అహంకారమే ఆయనను ఓడిస్తోందన్నారు. జగన్... అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిపై గతంలో ఫైటర్ అనే అభిప్రాయం ఉండేదని.. ప్రస్తుతం అతనిపై బ్లాక్ మెయిలర్ అనే ముద్ర పడిందన్నారు. కాంగ్రెస్ క్యాడర్, లీడర్ ఆయనకు సహకరించడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక రావటం బీజేపీకి కలసి వచ్చిందన్నారు.