Bonda Uma: వైసీపీ నేతల్లో ఓటమి భయం... అందుకే జగన్ చిన్నపాటి ఓదార్పు యాత్ర చేపట్టారు: బొండా ఉమ
- ఇటీవల విజయవాడలో ఐప్యాక్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం జగన్
- ఓడిపోతున్నామన్న విషయం జగన్ కు అర్థమైందన్న బొండా ఉమ
- అందుకే ఐప్యాక్ కార్యాలయంలో ప్రగల్భాలు పలికారని వెల్లడి
ఏపీలో తాజా పరిణామాలపై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓడిపోతున్నామన్న విషయం జగన్ కు అర్థమైందని, అందుకే ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు.
ఓటమి తప్పదన్న విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తామే గెలుస్తామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు కుదేలవుతున్నారని, అందుకే జగన్ చిన్నపాటి ఓదార్పు యాత్ర చేపట్టి ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న జగన్... ఎన్నికల్లో ఓడిపోతే పార్టీని మూసేస్తామని చెప్పగలరా? అని బొండా ఉమ సవాల్ విసిరారు.
ఇక, ఏపీలో పోలింగ్ నేపథ్యంలో జరిగిన హింసపై సిట్ తన నివేదికను డీజీపీకి అందించడంపైనా ఉమ స్పందించారు. సిట్ అందించిన నివేదికను డీజీపీ బహిర్గతం చేయాలని అన్నారు. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి, పిన్నెల్లి బ్రదర్స్, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, గోపిరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు, వేట కొడవళ్లు దొరికినా కేసులు నమోదు చేయడంలేదని బొండా ఉమ మండిపడ్డారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలుపాలవుతారన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని హితవు పలికారు. పల్నాడు, అనంతపురం ఎస్పీలకు ఎలాంటి పర్యవసానాలు ఎదురయ్యాయో ఇతర అధికారులు గమనించాలని అన్నారు.
ఇప్పటివరకు జరిగిన ఘటనల నేపథ్యంలో, సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటికి తీయాలని, అరాచకాలకు కారకులైన నేతల కాల్ డేటాను కూడా బయటికి తీయాలని బొండా ఉమ స్పష్టం చేశారు.