RS Praveen Kumar: కాంగ్రెస్ పాలన ఎంత హృదయవిదారకంగా ఉందో తెలుసుకోవాలంటే ఓ తండ్రి రాసిన ఈ లేఖ చదవాల్సిందే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ
- విమర్శల్లో పదును పెంచిన బీఆర్ఎస్
- కాంగ్రెస్ నాయకుల పిల్లలే విదేశాల్లో చదవాలా? అంటూ ప్రవీణ్ కుమార్ ఫైర్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎంత హృదయ విదారకంగా ఉందో తెలుసుకోవాలంటే ఓ తండ్రి కన్నీటితో రాసిన ఈ లేఖ చదవాల్సిందేనని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారు రారు... తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూడా సాక్షాత్తూ ముఖ్యమంత్రేనని వివరించారు.
కాగా, అమెరికాలో చదువుతున్న తన పిల్లలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం ఆగిపోయిందని, దాంతో తదుపరి సెమిస్టర్లకు ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, ఆ వ్యక్తి లేఖలో వాపోయారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా, సరైన స్పందన లేదని, ప్రస్తుతం తన పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ లేఖపై ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ... ప్రశ్నించే గొంతుకలకు ఈ పేద బిడ్డల గోస కనిపించదా? అని ప్రశ్నించారు. మీ కాంగ్రెస్ నాయకుల పిల్లలే విదేశాల్లో చదవాలా? మా పేదల పిల్లలు చదవొద్దా? అంటూ ప్రశ్నించారు.