AP DGP: సిట్ నివేదిక నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పందన

AP DGP reacts on SIT report
  • ఏపీలో పోలింగ్ రోజున, తర్వాత హింసాత్మక సంఘటనలు
  • నివేదికను డీజీపీకి అందజేసిన సిట్
  • కొందరిని అరెస్ట్ చేశామన్న డీజీపీ
  • కొందరికి నోటీసులు ఇచ్చామని వెల్లడి
రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సిట్ తన నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, డీజీపీ స్పందించారు. 

ఎన్నికల అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచామని వెల్లడించారు. ముగ్గురిపై పీడీ యాక్ట్, మరో ఇద్దరి బహిష్కరణకు సిఫారసు చేశామని తెలిపారు. 

పోలింగ్ ముందు రోజు నమోదైన కేసుల్లో 1,522 మందిని గుర్తించామని, ఎన్నికల రోజున నమోదైన కేసుల్లో 2,790 మందిని గుర్తించామని, పోలింగ్ అనంతరం నమోదైన కేసుల్లో 356 మందిని గుర్తించామని డీజీపీ పేర్కొన్నారు. వారిలో కొందరిని అరెస్ట్ చేశామని, మరికొందరికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. 

మాచర్ల నియోజకవర్గ శాంతిభద్రతలపై పల్నాడు ఎస్పీ సమీక్ష

పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మలికా గార్గ్ మాచర్ల నియోజకవర్గంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

అల్లర్లు, ఘర్షణలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఏపీఎస్పీ, కేంద్ర బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ మలికా గార్గ్ చెప్పారు. అభ్యర్థుల రక్షణ, నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం అని వివరించారు.

చీరాలలో పోలీస్ యాక్ట్-30, సెక్షన్-144 అమల్లో ఉన్నాయి: అడిషనల్ ఎస్పీ

బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ పాండురంగ విఠలేశ్వరరావు చీరాలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో జరిగిన గొడవలపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. 

చీరాలలో పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 అమల్లో ఉన్నాయని చెప్పారు. కౌంటింగ్ సందర్భంగా చీరాలలో పలు చోట్ల పోలీస్ పికెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పట్టణంలో ర్యాలీలకు అనుమతి లేదని అడిషనల్ ఎస్పీ స్పష్టం చేశారు. రౌడీ షీటర్లు, గొడవలకు పాల్పడే వారిని బైండోవర్ చేశామని వెల్లడించారు.
AP DGP
SIT
AP Violence
Polling
Andhra Pradesh

More Telugu News