SRH: అయ్యో సన్ రైజర్స్... మరీ ఇంత తక్కువ స్కోరా...?
- ఐపీఎల్ లో ఇవాళ క్వాలిఫయర్-1
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- విజృంభించిన కోల్ కతా బౌలర్లు
- 19.3 ఓవర్లలో 159 పరుగులకు సన్ రైజర్స్ ఆలౌట్
ఐపీఎల్ తాజా సీజన్ లో భారీ స్కోర్లకు పెట్టింది పేరైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ ట్యాగ్ లైన్ కు ఇవాళ న్యాయం చేయలేకపోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో క్వాలిఫయర్-1లో సన్ రైజర్స్ బ్యాటింగ్ ప్రదర్శన దారుణంగా ఉంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు ఏ రేంజిలో ఉతికారేస్తుందోనని అభిమానులు ఉవ్విళ్లూరితే... 19.3 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. స్టేడియంలో ఉన్న వాళ్ల సంగతి వదిలేస్తే, టీవీలకు అతుక్కుపోయిన సన్ రైజర్స్ అభిమానులు ఈ పేలవ బ్యాటింగ్ ను చూసి ఉసూరుమన్నారు.
ఇన్నింగ్స్ రెండో బంతికే ట్రావిస్ హెడ్ (0) డకౌట్ కాగా, రెండో ఓవర్లోనే అభిషేక్ శర్మ (3) అవుటయ్యాడు. 39 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయి విలవిల్లాడుతున్న సన్ రైజర్స్ ను రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ జోడీ ఆదుకుంది. త్రిపాఠి 35 బంతుల్లో 55 పరుగులు చేయగా, క్లాసెన్ 21 బంతుల్లో 32 పరుగులు చేశాడు.
చివర్లో కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాట్ ఝళిపించి 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ స్కోరు 150 మార్కు దాటింది. కమిన్స్ చివరి వికెట్ రూపంలో వెనుదిరగడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ కు తెరపడింది.
కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు. టోర్నీలో అత్యంత ఖరీదైన ఆటగాడైన స్టార్క్ తన రేటుకు న్యాయం చేసే బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో స్టార్క్ కొట్టిన దెబ్బకు సన్ రైజర్స్ కుదేలైంది. స్టార్క్... హెడ్, నితీశ్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0)లను అవుట్ చేశాడు.
ఇతర బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా 1, హర్షిత్ రాణా 1, సునీల్ నరైన్ 1, ఆండ్రీ రసెల్ 1 వికెట్ తీసి సన్ రైజర్స్ పతనంలో పాలుపంచుకున్నారు.