Indian Students: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగమ్మాయి సహా ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం
- ఈ నెల 14న అల్ఫారెట్టాలో రోడ్డు ప్రమాదం
- అతివేగం కారణంగా బోల్తాపడిన వాహనం
- ప్రమాద సమయంలో కారులో ఐదుగురు
గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో ప్రాణాలు కోల్పోతున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదాలు, హత్యలకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ 18 ఏళ్ల వయసు వారే కావడం విషాదం. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. ఈ నెల 14న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు.
మృతులను అల్ఫారెట్టా హైస్కూల్, జార్జియా యూనివర్సిటీకి చెందిన ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల, అన్విశర్మగా గుర్తించారు. వీరిలో శ్రియ అవసరాల తెలుగమ్మాయి. రిత్విక్ సోమేపల్లి, మొహమ్మద్ లియాకత్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారును డ్రైవ్ చేసింది లియాకత్ అని పోలీసులు తెలిపారు. అతివేగం కారణంగా కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బోల్తాపడినట్టు చెప్పారు. ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల అక్కడికక్కడే మృతి చెందగా అన్విశర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.