Pune Teen: తప్పుదోవ పట్టించేందుకు పూణె బాలుడి తండ్రి భలే ప్లాన్.. ఆటకట్టించిన పోలీసులు
- తాగిన మత్తులో తన పోర్షే కారుతో బైక్‌ను ఢీకొట్టిన పూణె బాలుడు
- ఘటనలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల దుర్మరణం
- 15 గంటల్లోనే నిందితుడికి బెయిల్ ఇచ్చిన జువైనల్ బోర్డు
- బాలుడికి కారు ఇచ్చినందుకు తండ్రిపై కేసు నమోదు
- ఆ వెంటనే కార్లు మారుస్తూ పారిపోయే యత్నం
- శంభాజీనగర్‌లో నిందితుడి అరెస్ట్
- జువైనల్ బోర్డు తీర్పును ప్రశ్నించిన దేవేంద్ర ఫడ్నవీస్
మద్యం మత్తులో కారు నడిపి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల (24) మృతికి కారణమైన పూణె బాలుడి తండ్రి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం వెలుగులోకి వచ్చింది. పసిగట్టిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. బాలుడికి కారు ఇచ్చినందుకు తండ్రిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే పూణెకు చెందిన ఈ రియల్టర్ పరారయ్యాడు. పోలీసులను ఏమార్చేందుకు కారెక్కిన అతడు ముంబై పోనివ్వాలని డ్రైవర్‌కు చెప్పాడు. మరో డ్రైవర్‌కు తన కారిచ్చి గోవా వెళ్లాలని చెప్పాడు.
ముంబై రోడ్డుపై ప్రయాణిస్తూ మధ్యలోనే కారు దిగిన నిందితుడు తన స్నేహితుడి కారులో ఛత్రపతి శంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్) బయలుదేరాడు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు పలుకార్లు ఉపయోగించాడు. అంతేకాదు, పోలీసులు తనను ట్రాక్ చేయకుండా కొత్త సిమ్‌కార్డు ఉపయోగించాడు.
రియల్టర్ తన స్నేహితుడి కారులో వెళ్తున్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు జీపీఎస్ ద్వారా కారును ట్రాక్ చేశారు. పూణె క్రైంబ్రాంచ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడు ప్రయాణిస్తున్న కారును గుర్తించారు. అతడు శంభాజీపూర్ చేరుకున్నాక అరెస్ట్ చేశారు. నేడు అతడిని కోర్టులో హాజరుపర్చనున్నారు.
జువైనల్ బోర్డు తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు
విలాసవంతమైన పోర్షే కారును తాగి డ్రైవ్ చేస్తూ ఇద్దరి మృతికి కారణమైన బాలుడికి 15 గంటల్లోనే జువైనల్ బోర్డు బెయిల్ మంజూరు చేయడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అంతేకాదు, ఇద్దరిని చంపేసిన బాలుడిని రోడ్డు ప్రమాదాలపై 300 పదాలతో వ్యాసం రాయమని ఆదేశించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 15 రోజులపాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయడమే కాకుండా తాగుడు అలవాటు మానుకునేందుకు కౌన్సెలింగ్ తీసుకోవాలని స్థానిక కోర్టు ఆదేశించింది.
బాలుడు తాగి కారు నడిపి బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని మధ్యప్రదేశ్‌కు చెందిన అనీశ్ అవధియ, అశ్విని కోష్తాగా గుర్తించారు. ఐటీ ఇంజినీర్లు అయిన వారిద్దరూ బైక్‌పై వస్తుండగా బాలుడి కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
జువైనల్ బోర్డు తీర్పును తప్పుబట్టిన ఫడ్నవీస్
తాగి కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన బాలుడికి 15 గంటల్లోనే జువైనల్ బోర్డు బెయిలు మంజూరు చేయడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విస్మయం వ్యక్తం చేశారు. బాలుడిపై కోర్టు కరుణ చూపినట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇద్దరి మరణానికి కారణమైన వ్యక్తికి ఇలాంటి తీర్పును బోర్డు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై తాము జిల్లా కోర్టులో సవాలు చేసినట్టు తెలిపారు.