Road Accident: ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి?: సజ్జనార్

what is the reason for this road accident asks vc sajjanar
  • రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న వీడియోను నెటిజన్లతో పంచుకున్న టీఎస్ ఆర్టీసీ ఎండీ
  • ప్రమాదానికి ప్రధాన కారణం ఏమిటో చెప్పగలరా అంటూ సోషల్ మీడియా యూజర్లకు ప్రశ్న
  • ఇద్దరిదీ తప్పేనని అభిప్రాయపడ్డ నెటిజన్లు.. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని వినతి
సీనియర్ ఐపీఎస్, తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. ట్రాఫిక్ నిబంధనలను అనుసరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంటారు.

తాజాగా ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ రోడ్డు ప్రమాద వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి స్పోర్ట్స్ బైక్ పై అతివేగంగా దూసుకెళ్లడం కనిపించింది. కొంత దూరం వెళ్లాక రోడ్డు పక్క నుంచి మరో ద్విచక్ర వాహనదారుడు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో రెండు బైక్ లు ఢీకొన్నాయి. వాహనాలపై ఉన్న వారంతా కిందపడిపోయారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏమిటని సజ్జనార్ నెటిజన్లను ప్రశ్నించారు. ‘అతివేగమా, నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా?’ వీటిలో దేనివల్ల రోడ్డు ప్రమాదం జరిగిందో చెప్పాలని కోరారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖతోపాటు టీం రోడ్ స్క్వాడ్ ను తన పోస్ట్ కు ట్యాగ్ చేశారు. అలాగే రోడ్ యాక్సిడెంట్, రోడ్ సేఫ్టీ పేర్లతో హ్యాష్ ట్యాగ్ లను జత చేశారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు స్పందించారు. ఇద్దరు వాహనదారులదీ తప్పేనని ముక్తకంఠంతో చెప్పారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ విషయంలో చట్టం చాలా కఠినంగా వ్యవహరిస్తేనే వాహనదారులు దారికి వస్తారని చెప్పారు. వేగాన్ని నియంత్రించేందుకు జంక్షన్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఉండాలని కొందరు యూజర్లు సూచించారు.
Road Accident
VC Sajjanar
Social Media
Post
Viral Video
Overspeed
Negligence

More Telugu News