Narendra Modi: ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి... వ్యాపిస్తే దేశాన్నే నాశనం చేస్తుంది: ప్రధాని మోదీ
- మతతత్వం, తీవ్ర జాతి వివక్ష, బంధుప్రీతి ఇండియా కూటమి వ్యాధులని విమర్శ
- మోదీ 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు ఇస్తే... వారు వాటిని గుంజుకుంటారని ఆరోపణ
- 60 ఏళ్లుగా ఏమీ చేయని వారు మోదీని నిలువరించేందుకు ఏకమయ్యారని ఆగ్రహం
విపక్ష ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకారి అని... అది వ్యాపిస్తే దేశాన్నే నాశనం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం యూపీలోని స్రవస్థిలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... విపక్ష ఇండియా కూటమికి మతతత్వం, తీవ్ర జాతి వివక్ష, బంధుప్రీతి వంటి వ్యాధులున్నాయన్నారు. ఇవి క్యాన్సర్ కంటే ప్రమాదకరమైన వ్యాధులన్నారు.
మోదీ దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది పేదలకు ఇళ్ళు ఇచ్చారని, ఇప్పుడు సమాజ్‌వాది, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అన్నింటినీ తారుమారు చేస్తారని హెచ్చరించారు. విపక్షాలు గెలిస్తే పేదలకు తాము నిర్మించిన ఇళ్లను గుంజుకుని వాటిని తమ ఓటు బ్యాంకుకు పంచివేస్తాయని ఆరోపించారు. తాను ప్రారంభించిన 50 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలను మూసివేసి ఆ డబ్బును వారు లాగేసుకుంటారని విమర్శించారు. మోదీ ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తే విపక్షాలు విద్యుత్ కనెక్షన్లను కట్ చేసి మళ్లీ చీకట్లోకి తీసుకువెళతాయన్నారు.
బీజేపీ ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తే... విపక్షాలు మీ ఇంటి పంపుల నుంచి నీటిని తీసుకువెళతాయని హెచ్చరించారు. ప్రజల కోసం 60 ఏళ్లుగా ఏమీ చేయని వారు మోదీని నిలువరించేందుకు ఏకమయ్యారన్నారు. యూపీలో అదే పాత ఫ్లాప్ సినిమాతో అదే పాత క్యారెక్టర్లు, పాత డైలాగ్‌లతో ఇద్దరు వారసత్వ నేతలు బయలుదేరారని ఎద్దేవా చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించబోవన్నారు.