Chandrababu: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిని నిలదీసిన కార్యకర్తకు ఫోన్ చేసి అభినందించిన చంద్రబాబు
- పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం ఘటనలో గాయపడ్డ టీడీపీ మద్దతుదారు శేషగిరిరావు
- పార్టీ అండగా ఉంటుందని... ధైర్యంగా ఉండాలని చంద్రబాబు భరోసా
- ఈవీఎంపై దాడిని ధైర్యంగా అడ్డుకునే ప్రయత్నం చేశారన్న అధినేత
మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం ఘటనలో బాధితుడు శేషగిరిరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి, పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని... ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈవీఎంపై దాడిని ధైర్యంగా అడ్డుకునే ప్రయత్నం చేశారని అభినందించారు.
పోలింగ్ రోజున పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ ఏజెంట్‌గా ఉన్న శేషగిరిరావు నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో అతనిపై ఎమ్మెల్యే అనుచరులు మారణాయుధాలతో దాడి చేసినట్టు వార్తలొచ్చాయి.
తనపై దాడి తర్వాత శేషగిరిరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో శేషగిరిరావు అజ్ఞాతం వీడారు. దాడి విషయం తెలుసుకున్న చంద్రబాబు అతనిని ఫోన్లో పరామర్శించారు. పిన్నెల్లి ఎమ్మెల్యేగా కాకుండా వీధిరౌడీలా ప్రవర్తించారని, ఆయన అనుచరులు ఈవీఎంను పగులగొట్టారని మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే చర్యలకు ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు.