Kasu Mahesh Reddy: మాచర్లలో టీడీపీ రిగ్గింగ్ చేస్తేనే... పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు: వైసీపీ నేత కాసు మహేశ్

Kasu Mahesh clarifies why Pinnelli destroyed EVM in Macharla
  • పాల్వాయిగేటు కేసులో ఒకే వీడియోను విడుదల చేశారు... అన్నీ విడుదల చేయాలని డిమాండ్
  • పిన్నెల్లి దాడి చేయడానికి ముందు ఏం జరిగిందో వీడియో బయటపెట్టాలన్న మహేశ్
  • ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే తాము కోర్టుకు వెళతామన్న కాసు మహేశ్
  • నలుగురైదుగురిని మేనేజ్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని వ్యాఖ్య
  • పిన్నెల్లికి ప్రజాబలం ఉంది... ఆయన ఎవరికీ భయపడరన్న కాసు మహేశ్
మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని... అందుకే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని వైసీపీ నేత, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఈ ఘటనపై ఎంత వరకైనా వెళతామన్నారు. మాచర్లలో రిగ్గింగ్ జరిగిన మాట వాస్తవం అన్నారు. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఒక్క వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని... అన్ని వీడియోలు కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ లోపలే కాదు... బయట కూడా ఏం జరిగిందో తెలియాలన్నారు. పిన్నెల్లి దాడి ఘటనకు రెండు మూడు గంటల ముందు ఏం జరిగిందో వీడియో విడుదల చేయాలన్నారు.

పోలింగ్ బూత్‌లలో కెమెరాలు పెట్టిందే అన్నీ తెలుసుకోవడానికి అన్నారు. మాచర్లలో పొరపాట్లు జరిగాయని... తాము పది రోజులుగా మొత్తుకుంటున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మాచర్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగిందని తెలిపారు. కాబట్టి ఎన్నికల సంఘం అన్నింటిపై చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? ఎవరు రెచ్చగొట్టారు? తెలియాలంటే వీడియోలు బయటకు రావాలన్నారు. ఈసీ చర్యలు తీసుకోవాలని... లేదంటే తాము కోర్టుకు వెళతామన్నారు. జగన్ రెండోసారి సీఎం అయ్యాక ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాఫ్తు జరిపిస్తామన్నారు.

ఈసీ తమకు న్యాయం చేయాలని... లేదంటే విశ్వసనీయత పోతుందని హెచ్చరించారు. తప్పు ఎవరు చేసినా శిక్షించాలని తాము స్పష్టంగా చెబుతున్నామన్నారు. రిగ్గింగ్ జరిగిందని తాము చెబుతున్నామని... జరగలేదని వారు నిరూపించాలని సవాల్ చేశారు. అధికారులను బదిలీ చేశారంటే పోలింగ్ నిర్వహణలో ఎవరు విఫలమయ్యారో తెలిసిపోతోందన్నారు. నలుగురైదుగురిని మేనేజ్ చేసి కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదన్నారు.

పిన్నెల్లికి కేసులు కొత్త కాదని... ఆయన భయపడే వ్యక్తి కాదన్నారు. టీడీపీ హయాంలో అక్రమ కేసులు పెడితే 2019లో ఆయన ప్రజాబలంతో గెలిచిన వ్యక్తి అన్నారు. జనం మద్దతు ఉన్న పిన్నెల్లి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతారు? అని ప్రశ్నించారు. పిన్నెల్లి ఈవీఎంను పగులగొట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ప్రజాబలంతో మూడుసార్లు గెలిచిన పిన్నెల్లి నాలుగోసారి కూడా గెలుస్తున్నారని జోస్యం చెప్పారు. టీడీపీ ఫ్యాక్షన్‌ను నడిపిస్తూ... గొడవలు పెడుతూ తమపై బురద జల్లుతోందని మండిపడ్డారు.
Kasu Mahesh Reddy
Pinnelli Ramakrishna Reddy
YSRCP
Telugudesam

More Telugu News