Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలి: టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి డిమాండ్
- పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కలిసిన టీడీపీ నేతలు
- పథకం ప్రకారమే దాడులకు పాల్పడ్డారని బ్రహ్మారెడ్డి ఆరోపణ
- పాల్వాయిగేటు ఘటనలో అన్నింటికి ఎమ్మెల్యేనే కారణమన్న బ్రహ్మారెడ్డి
మాచర్లలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. పథకం ప్రకారమే దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని టీడీపీ నేతలు కోరారు. డీజీపీని కలిసిన వారిలో బ్రహ్మారెడ్డితో పాటు దేవినేని ఉమ, వర్ల రామయ్య తదితరులు ఉన్నారు. అనంతరం బ్రహ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పిన్నెల్లి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారన్నారు.
పాల్వాయిగేటు ఘటనలో అన్నింటికి ఎమ్మెల్యేనే కారణమన్నారు. ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన శేషగిరిరావుపై రౌడీలతో దాడి చేయించడం దుర్మార్గమన్నారు. పోలింగ్‌కు ముందు... ఆ తర్వాత నియోజకవర్గంలో ఏ చిన్న ఘటన జరిగినా అందులో ఎమ్మెల్యే ప్రమేయం ఉందన్నారు. దాడులు చేస్తామని పిన్నెల్లి ముందే చెప్పాడని... చెప్పిన విధంగా దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులకు సవాల్ విసిరి... ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేశారని మండిపడ్డారు.