Prashant Kishor: కరణ్​ థాపర్ ఇంటర్వ్యూలో వాడీవేడి వాతావరణం... తగ్గేదే లే అంటూ ప్రశాంత్ కిశోర్ ఫైర్

Prashant Kishore fumes on interviewer Karan Thapar on Himachal election prediction gone wrong
  • హిమాచల్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని తాను చెప్పలేదని స్పష్టీకరణ
  • తాను అలా చెప్పినట్లు వీడియో సాక్ష్యం చూపాలని డిమాండ్
  • పత్రికలు, వెబ్ సైట్లు ఇష్టానుసారం వార్తలు రాస్తాయని వ్యాఖ్య
ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ వ్యూహకర్తగా మారిన ప్రశాంత్‌ కిషోర్‌ ఓ ఇంటర్వ్యూలో సహనం కోల్పోయారు. గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందంటూ చెప్పిన జోస్యం తప్పింది కదా అంటూ సీనియర్‌ జర్నలిస్ట్‌ కరణ్‌ థాపర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన చిందులు తొక్కారు. 

తాను జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ చెప్పుకొచ్చారు. హిమాచల్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని తాను అన్నట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలు, ప్రముఖ వెబ్‌ సైట్‌ లు ఈ వార్తను ప్రచురించాయని గుర్తుచేయగా ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. పత్రికలు, వెబ్ సైట్లు ఇష్టానుసారం వార్తలు రాస్తాయని విమర్శించారు. 

అయితే కరణ్‌ థాపర్‌ తన ప్రశ్నను వివరించేందుకు ప్రయత్నించినా పీకే వినలేదు. ఆధారాలు చూపించనందుకు క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. నేను హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల అంచనాలు వెలువరించినట్టు ఏదైనా వీడియో ఆధారం ఉందా అంటూ ప్రశాంత్ కిశోర్ పట్టుబట్టారు. 

అందుకు కరణ్ థాపర్ స్పందిస్తూ, ఓ న్యూస్ పేపర్ లో వచ్చిన క్లిప్పింగ్ ను చూపించారు. న్యూస్ పేపర్లలో ఏవైనా రాస్తుంటారని, అవన్నీ నిజమవుతాయా అని ప్రశాంత్ కిశోర్ కౌంటర్ చేశారు. మీ ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లపై మీరు అనుకున్నదే నిజం అంటూ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుంటారు... అలాంటివి నామీద చేయలేరు అంటూ ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్నట్టుగా చెప్పారు.

దానికి కరణ్‌ థాపర్‌ స్పందిస్తూ తెలంగాణలోనూ బీఆర్ ఎస్ గెలుస్తుందంటూ చెప్పిన జోస్యం ఫలించలేదని గుర్తుచేయగా పీకే ఏమాత్రం లెక్కచేయలేదు. ఇంటర్వ్యూ పేరుతో తనను భయపెట్టాలని చూసినా తాను భయపడబోనంటూ వ్యాఖ్యానించారు. ఇతరుల్లా తాను ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే వెళ్లిపోయే రకం కాదని చెప్పుకొచ్చారు. 

చివరికి "కంగ్రాట్స్" అంటూ కరణ్ థాపర్ కొద్దిగా వెనుకంజ వేశారు. దాంతో, ఇక ఇంటర్వ్యూ కొనసాగించండి అంటూ ప్రశాంత్ కిశోర్ సాధారణ స్థితికి వచ్చారు.

ఎన్నికల ఫలితాల జోస్యాలు అంత నమ్మకంగా ఎలా చెప్పగలరని మాత్రమే తాను అడిగానని కరణ్ థాపర్ చెప్పగా మరో ప్రశ్నకు వెళ్లాలంటూ సూచించారు. ఈ ఇంటర్వ్యూ వీడియోను ‘ద వైర్’ సంస్థ విడుదల చేసింది. దాన్ని ఓ నెటిజన్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.

Prashant Kishor
Karan Thapar
Interview
Election Result
Prediction
Wrong
Himachal Pradesh
Telangana

More Telugu News