Kanchi Pattu: బంగారం ధరలతో కంచి పట్టుచీరల ధరలు పోటీ.. భయపడుతున్న మగువలు!
- గతేడాది రూ. 70 వేలున్న చీర ఇప్పుడు రూ. 1.2 లక్షలు
- కళా విహీనం అవుతున్న వ్యాపారాలు
- బంగారు, వెండి జరీలేని చీరలవైపు చూస్తున్న మహిళలు
- పెళ్లిళ్ల సీజన్ వేళ ఇది తమకు శరాఘాతమేనంటున్న వ్యాపారులు
మగువలు ఎంతో ఇష్టపడే కంచిపట్టు చీరల ధరలు ఇప్పుడు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. బంగారం ధరలతో పోటీపడుతున్నాయి. పుత్తడి ధర ఏమాత్రం పెరిగినా ఆ వెంటనే చీరల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా కంచిపట్టు చీరలవైపు చూసేందుకు మహిళలు జంకుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ వేళ చీరల ధరలు అమాంతం పెరగడం వారిని కలవరపాటుకు గురిచేస్తోంది.
బంగారం, వెండి జరీతో మైమరపించే చీరలపై మనసు పారేసుకోని మగువలు ఉండరనడం అతిశయోక్తికాదు. అయితే, బంగారం ధరలు పెరగడంతోనే ఆ మేరకు జరీచీరల ధరలు కూడా పెరుగుతున్నాయి. గత 8 నెలల్లో ఏకంగా 50 శాతం పెరిగాయి. దీంతో చాలామంది వినియోగదారులు బంగారం కాకుండా వెండి జరీ చీరలపై మొగ్గు చూపుతున్నారు. వాటి ధరలను కూడా భరించలేనివారు ఒట్టి పట్టుచీరలతో సరిపెట్టుకుంటున్నారు.
పుత్తడి ధరలతోపాటే చీరల ధరలు కూడా పెరగడంతో వ్యాపారాలు కళతప్పాయి. కాంచీపురం చీరల్లో ప్రసిద్ధి చెందిన బ్రాండ్ అయిన ఆర్ఎంకేవీ వ్యాపారం 20 శాతం పడిపోయింది. పెళ్లిళ్ల వేళ సేల్స్ ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారని ఆ సంస్థ ఎండీ కె.శివకుమార్ తెలిపారు. చీరల ధరలు పెరగడం రూ. 10 వేల కోట్ల పట్టు పరిశ్రమను దారుణంగా దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతేడాది అక్టోబరుతో పోలిస్తే ఈ నెలలో 40 నుంచి 50 శాతం ధరలు పెరిగినట్టు కాంచీపురం సిల్క్ శారీ మాన్యుఫ్యాక్చరర్ అసోసియేషన్‌కు చెందిన వీకే దామోదరన్ తెలిపారు. కంచిపట్టు చీరల ధరలు సాధారణంగా రూ. 20 వేలతో మొదలై రూ. 2.5 లక్షల వరకు ఉంటాయి. గతేడాది అక్టోబర్‌లో రూ.70 వేలు ఉన్న చీర ధర ప్రస్తుతం రూ. 1.2 లక్షలకు పెరిగినట్టు కేఎస్ పార్థసారథి హ్యాండ్లూమ్ వీవర్స్ అసోసియేషన్‌కు చెందిన జె. కమలనాథన్ చెప్పారు.