Rahul Gandhi: ఎన్నికల్లో ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి: రాహుల్ గాంధీ
- ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భవన్ కు వెళ్లిన రాహుల్ గాంధీ
- ఇండియా కూటమి గెలవబోతోందని ధీమా
- మోదీ తాను దేవదూతనని చెప్పుకుంటున్నారని విమర్శలు
- నేరుగా సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లాలని ఎద్దేవా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ కు వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ, ఈసారి ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని తెలిపారు. ఇండియా కూటమి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఏడు సీట్లలోనూ విజయం సాధిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగం, రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై దాడి చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నారని మండిపడ్డారు.
ఇటీవల మోదీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనది సాధారణ జన్మ కాదని, తాను దైవాంశ సంభూతుడినని, దేవదూతనని చెప్పుకొచ్చారు. తన తల్లి బతికున్నంత కాలం తాను జీవ సంబంధంగా జన్మించినట్టుగానే భావిస్తానని, ఆ తర్వాత నుంచి మాత్రం తనను ఆ దేవుడే పంపించినట్టు భావిస్తానని అన్నారు.
దీనిపై రాహుల్ గాంధీ వ్యంగ్యం ప్రదర్శించారు. ఎవరైనా ఒక వ్యక్తి తాను జీవ సంబంధంగా పుట్టలేదు అని చెబితే, అతడిని నేరుగా సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు.