Chemical Factory Blast: ముంబయిలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు... ఆరుగురి మృతి
- థానే జిల్లాలో ఘటన
- బాయిలర్ పేలడంతో అగ్నిప్రమాదం
- కిలోమీటరు దూరం వరకు వినిపించిన పేలుడు శబ్దం
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థానే జిల్లా డోంబివిలీ ప్రాంతంలోని ఆంబర్ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో నలుగురు మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు.
బాయిలర్ పేలుడుతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
కెమికల్ ఫ్యాక్టరీలో ఈ మధ్యాహ్నం 1.15 గంటలకు పేలుడు జరిగిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను వెలికితీసినట్టు తెలిపారు.
కాగా, పేలుడు శబ్దం కిలోమీటరు వరకు వినిపించినట్టు స్థానికులు పేర్కొన్నారు. పొరుగునే ఉన్న భవనాల కిటికీ అద్దాలు సైతం పేలుడు ధాటికి పగుళ్లిచ్చాయని వివరించారు. కొన్ని నివాస గృహాలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది.