Jaya Badiga: తెలుగు సంతతి మహిళ జయ బాడిగ కాలిఫోర్నియా జడ్జి పదవిని చేపట్టడం సంతోషదాయకం: చంద్రబాబు
- విజయవాడ మూలాలున్న జయ బాడిగకు అమెరికాలో కీలక పదవి
- శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా నియామకం
- మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె జయ బాడిగ
విజయవాడ మూలాలున్న జయ బాడిగ అమెరికాలో కీలక పదవిని చేపట్టారు. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా ఆమె నియమితులయ్యారు. ఆమె గత రెండేళ్లుగా కొనసాగుతున్న న్యాయస్థానంలోనే పదోన్నతి పొందారు.
జయ బాడిగ మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె. కాగా, జయ బాడిగ అమెరికా న్యాయ వ్యవస్థలో కీలక పదవిని చేపట్టడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
విజయవాడలో పుట్టిన జయ బాడిగ కాలిఫోర్నియా జడ్జి పదవిని చేపట్టిన తెలుగు సంతతికి చెందిన తొలి మహిళ కావడం సంతోషదాయకం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆమె తన పదవీకాలంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
జయ బాడిగ హైదరాబాద్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ నుంచి బీఏ పట్టా అందుకున్న ఆమె అమెరికాలో శాంటాక్లారా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. పదేళ్ల పాటు ప్రైవేట్ న్యాయవాదిగా కొనసాగారు.