Lok Sabha Polls: 58 లోక్‌సభ స్థానాలకు మొదలైన పోలింగ్.. 6వ దశ పోలింగ్ షురూ

Lok Sabha 6th phase polling started in 58 constituencies in 6 States and 2 union territories
  • 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదలైన ఓటింగ్
  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
  • అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 889 మంది అభ్యర్థులు
  • సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ప్రక్రియ
లోక్‌సభ ఎన్నికలు-2024లో ఆరవ దశ పోలింగ్ పోలింగ్ ఈ రోజు (శనివారం) ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓటింగ్‌ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్‌లో 8 సీట్లు, హర్యానాలో మొత్తం 10 సీట్లు, జమ్మూకశ్మీర్‌లో 1 సీటు, ఝార్ఖండ్‌లో 4, ఢిల్లీలోని మొత్తం 7 సీట్లు, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 8 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 11.13 కోట్ల మంది ఓటర్లు ఆరో దశలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు, 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. దాదాపు 11.4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు.

ఈ దశలో పోటీ చేస్తున్న ప్రముఖ రాజకీయ నాయకులలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. కర్నాల్ స్థానం నుంచి బీజేపీ సీనియర్ మనోహర్ లాల్ ఖట్టర్, అనంతనాగ్-రాజౌరి నుంచి పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఉన్నారు. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ జాబితాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఆరో దశ పోలింగ్‌లో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని అధికార బీజేపీ సహా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని 7 స్థానాలపై పార్టీలు దృష్టిపెట్టాయి. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో కాంగ్రెస్ 3 స్థానాలు, ఆప్ 4 సీట్లలో పోటీ చేస్తున్నాయి. హర్యానాలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.

కాగా ఇప్పటివరకు ఐదు విడతల పోలింగ్ పూర్తవ్వగా 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 428 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. నేడు (శనివారం) 6వ దశ పోలింగ్ ముగిస్తే మరొక్క దశ మాత్రమే మిగిలివుంటుంది. జూన్ 1తో ఏడవ దశ పోలింగ్ కూడా ముగుస్తుంది. జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి.
Lok Sabha Polls
Election Commission
6th phase Polling
Polling

More Telugu News