Lok Sabha Polls: లోక్‌సభ 6వ దశ ఎన్నికల అభ్యర్థుల్లో 39 శాతం మంది కోటీశ్వరులు

39 percent Lok Sabha Phase 6 Candidates are Crorepatis says ADR Report
  • 866 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 338 మంది కరోడ్‌పతులు
  • హర్యానాలో అత్యధిక అభ్యర్థులు కోటీశ్వరులేనని తెలిపిన ఏడీఆర్ రిపోర్ట్
  • దేశవ్యాప్తంగా 58 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న 6వ దశ లోక్‌సభ పోలింగ్
లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా నేడు (శనివారం) ఆరవ దశ పోలింగ్ కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఈ దశలో మొత్తం 866 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వారిలో 338 (39 శాతం) మంది కోటీశ్వరులని, వారి సగటు ఆస్తి విలువ రూ.6.21 కోట్లుగా ఉందని ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) నివేదిక పేర్కొంది.

మొత్తం అభ్యర్థుల్లో 14 శాతం మందికి రూ.5 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నాయని, 13 శాతం మందికి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ఆస్తులు ఉన్నాయని వివరించింది. ఇక అభ్యర్థుల్లో 22 శాతం మంది రూ.50 లక్షల - రూ.5 కోట్ల మధ్య, 25 శాతం మంది రూ.10 లక్షల - రూ.50 లక్షల మధ్య ఆస్తులను కలిగివున్నారని తెలిపింది. అయితే 26 శాతం మంది ఆస్తుల విలువ రూ.10 లక్షల లోపేనని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది.

రాష్ట్రాల వారీగా చూస్తే హర్యానాలో మొత్తం 223 మంది అభ్యర్థులు బరిలో నిలవడగా వారిలో 102 మంది కోటీశ్వరులని ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. ఢిల్లీలో పోటీ చేస్తున్నవారిలో  68 మంది, ఉత్తరప్రదేశ్‌లో పోటీ చేస్తున్నవారిలో 59 మంది, బీహార్ నుంచి 35, ఝార్ఖండ్ నుంచి 25, ఒడిశా నుంచి 28, పశ్చిమ బెంగాల్ నుంచి 21 మంది అభ్యర్థులు కోటీశ్వర్లుగా ఉన్నారని వివరించింది.

అభ్యర్థుల పరంగా చూస్తే బీజేపీ అభ్యర్థి, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ రూ.1241 కోట్లతో ఈ దశలో పోటీ చేస్తున్నవారిలో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఒడిశాలోని కటక్‌ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సంత్రుప్త్ మిశ్రా రూ.482 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక నవీన్ జిందాల్‌కు కురుక్షేత్రలో గట్టి పోటీ ఇస్తున్న ఆప్ అభ్యర్థి సుశీల్ గుప్తా రూ.169 కోట్లతో మూడవ సంపన్న అభ్యర్థిగా నిలిచారు.
Lok Sabha Polls
6th Phase Polling
Elections
Polling
BJP
Naveen Jindal

More Telugu News