Bionic Arm: ఐదేళ్ల బాలుడికి ‘ఐరన్ మ్యాన్’ తరహా బయోనిక్ చెయ్యి!

US Boy Born With One Hand Becomes Youngest To Receive Bionic Hero Arm At Five
  • ఎడమ చెయ్యి మణికట్టు వరకు లేకుండా పుట్టిన అమెరికా బాలుడు జోర్డాన్ మరొట్టా
  • కృత్రిమ చేతిని అందించిన ఓపెన్ బయోనిక్స్ సంస్థ
  • కండరాల కదలికలకు అనుగుణంగా స్పందించేలా కృత్రిమ చేతిలో ఎలక్ట్రోడ్ లు, సెన్సార్ల ఏర్పాటు
అమెరికాలోని లాంగ్ ఐల్యాండ్ కు చెందిన జోర్డాన్ మరొట్టా అనే ఐదేళ్ల బాలుడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఎడమ చెయ్యి మణికట్టు వరకు లేకుండా పుట్టిన అతనికి ఓపెన్ బయోనిక్స్ అనే సంస్థ ‘ఐరన్ మ్యాన్’ తరహా బయోనిక్ చెయ్యిని అందించింది. తద్వారా ఈ చెయ్యి పొందిన అతిపిన్న వయస్కుడిగా జోర్డాన్ ఘనత సాధించాడు. బాలుడి కోరికపై హాలీవుడ్ చిత్రం ఐరన్ మ్యాన్ లో హీరో పాత్రధారి ధరించే కృత్రిమ చేయిని పోలిన ఎరుపు, బంగారు రంగుల్లోని బయోనిక్ చెయ్యిని తయారు చేశారు. ఈ విషయాన్ని ‘ద న్యూయార్క్ పోస్ట్ ’వెల్లడించింది. 

కొత్త చెయ్యి అమర్చగానే తన కుమారుడు సంతోషంతో చేతిని పైకి లేపి మన్ హట్టాన్ వీధుల్లో ‘ట్యాక్సీ’ అని గట్టిగా అరిచాడని అతని తల్లి ఆష్లే మరొట్టా తెలిపింది. తమ కుమారుడికి బయోనిక్ చెయ్యి కోసం జోర్డాన్ తల్లిదండ్రులు అతన్ని పార్క్ అవెన్యూలో ఉన్న ఓపెన్ బయోనిక్స్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ కృత్రిమ చేతులను సిద్ధం చేయడంలో నైపుణ్యంగల డేనియల్ గ్రీన్ ఆ బాలుడికి ‘హీరో’ చెయ్యిని బిగించాడు.

సాధారణంగా కృత్రిమ చేతులను కాస్త పెద్ద పిల్లలకు అమర్చేందుకు వీలవుతుంది. కానీ జోర్డాన్ శారీరక ఎదుగుదల, మానసిక పరిపక్వత కారణంగా చిన్నవయసులోనే బయోనిక్ చెయ్యి అమర్చడం సాధ్యమైందని డేనియల్ గ్రీన్ వివరించాడు.

ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా అమర్చుకొని తిరిగి విప్పేలా బయోనిక్ చెయ్యిని రూపొందించారు. ఈ కృత్రిమ చెయ్యిలోని ఎలక్ట్రోడ్ లు, సెన్సార్లు కండరాల కదలికలను పసిగట్టి అందుకు అనుగుణంగా చెయ్యి, వేళ్లను కదిలిస్తాయి. రీచార్చబుల్ బ్యాటరీ సాయంతో బయోనిక్ చెయ్యి పనిచేస్తుంది. ఇందులోని బ్యాటరీ సుమారు 14 గంటలపాటు పనిచేస్తుంది. ఈ చెయ్యిని తయారు చేసేందుకు నెల రోజుల సమయం పడుతుంది.

గతేడాది యూకేలో హ్యారీ జోన్స్ అనే పదేళ్ల బాలుడికి కూడా ఈ తరహా బయోనిక్ చెయ్యిని అమర్చారు.

Bionic Arm
The Newyork Post
Open Bionics
5 Year Old Boy
America

More Telugu News