Allu Arjun: అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదం .. ఇద్దరు కానిస్టేబుల్స్ పై వేటు

Two Conistables Sent VR Regarding Allu Arjun Nandyala Tour
  • కానిస్టేబుల్స్ ను వీఆర్ కు పంపిస్తూ ఆదేశాలు జారీ
  • ఎన్నికల కోడ్ అమలులో ఉండగా జనసమీకరణ చేయడంపై ఈసీ సీరియస్
  • హీరో పైనా కేసు నమోదు చేసిన పోలీసులు
హీరో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు గుమికూడడంతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సీరియస్ గా స్పందించింది. భారీ జనసమీకరణ జరుగుతోందని సమాచారం అందించలేదనే కారణంతో ఇద్దరు కానిస్టేబుల్స్ పై చర్యలకు ఆదేశించింది. ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఎస్బీ కానిస్టేబుళ్లు స్వామి నాయక్, నాగరాజులను ఉన్నతాధికారులు వీఆర్ కు పంపించారు. ఈమేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్ పైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ ఈ నెల 11న తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు. హీరో వస్తున్నాడని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో శిల్పా రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా భారీ ఎత్తున జనం గుమికూడడంపై ఈసీ సీరియస్ గా స్పందించింది.

విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంలో, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావడంలో విఫలమైన పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈమేరకు ఈసీ నుంచి నోటీసులు అందుకున్న ఎస్పీ, డీఎస్పీ.. ఇద్దరు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. దీనిపై స్థానిక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయడంతో హీరో అల్లు అర్జున్ తో పాటు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డిపై కేసు నమోదు చేశారు.
Allu Arjun
Nandyal
Shilpa Ravichandra Reddy
CEC
Conistables
AP Polls

More Telugu News