Varla Ramaiah: వైసీపీ నేతలు అందుకే ఎవరూ బయటికి రావడంలేదు: వర్ల రామయ్య
- టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రెస్ మీట్
- ఓడిపోతున్నామన్న విషయం వైసీపీ నేతలకు అర్థమైందని వెల్లడి
- అమెరికా వెళ్లిన చంద్రబాబు ఎప్పుడొస్తారో తనకు తెలుసని స్పష్టీకరణ
- మరి జగన్ లండన్ నుంచి ఎప్పుడొస్తారో వైసీపీ నేతలకు తెలుసా? అని ప్రశ్న
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోతున్న విషయం వైసీపీ శ్రేణులకు అర్థమైందని అన్నారు. అందుకే ఆ పార్టీ నేతలెవరూ బయటికి రావడంలేదని ఎద్దేవా చేశారు.
అమెరికా వెళ్లిన తమ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి తిరిగొస్తారని, మరి లండన్ వెళ్లిన జగన్ తిరిగొస్తారో, రారో...! అంటూ వర్ల రామయ్య వ్యంగ్యం ప్రదర్శించారు. మా నాయకుడి రిటర్న్ టికెట్ గురించి నాకు తెలుసు... మీ నాయకుడి తిరుగు టికెట్ గురించి మీకు తెలుసా? అని ప్రశ్నించారు.
జగన్ లండన్ వెళుతున్న సమయంలో... వైసీపీకి 144 స్థానాలు వస్తాయిలే అన్నా అని సజ్జలకు చెప్పారట... అబద్ధాలతో మాయచేయాలని సజ్జల ప్రయత్నిస్తున్నారు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
"పోలింగ్ ముగిసిన రోజు నుంచి వైసీపీ నేతల్లో నిరాశా, నిస్పృహలు పెరిగిపోయాయి. ఎవరు కనబడితే వారిపై అభాండాలు వేస్తున్నారు. వాళ్ల నీలి పత్రికలో ఇవాళ రాశారు... వెబ్ కాస్టింగ్ ను హైజాక్ చేశారంట... ఆ బటన్లు నొక్కే కంట్రోల్ చంద్రబాబు వద్ద ఉందంట! బుద్ధిలేని రాతలు ఇవి. పత్రిక చేతిలో ఉందని ఇష్టంవచ్చినట్టు రాస్తారా? వెబ్ కాస్టింగ్ ను నియంత్రించేది ఎన్నికల సంఘం.
సజ్జల రామకృష్ణారెడ్డి అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నాడు. అతడికేమీ తెలియదు. కానీ అన్నీ తెలిసినట్టు ఒక మేధావిలా మాట్లాడుతుంటాడు. వెబ్ కాస్టింగ్ ను జిల్లాలో కలెక్టర్లు, నియోజకవర్గాల్లో ఆర్వోలు పర్యవేక్షిస్తుంటారు. వాళ్లందరూ మీరు పోస్టు చేసిన వాళ్లు కాదా? పోలింగ్ ఆఫీసర్లందరూ మీరు పోస్టు చేసిన వాళ్లు కాదా? మరి సిగ్గులేకుండా మా మీద ఏడుస్తారేంటయ్యా? వెబ్ కాస్టింగ్ కు చంద్రబాబుకు ఏమిటి సంబంధం? మీ బ్లూ పత్రికలో ఇష్టంవచ్చినట్టు రాస్తే అది రాష్ట్ర ప్రజలు నమ్మాలా?
పోలింగ్ తీరు అర్థం కావడంతో వైసీపీ నేతల్లో సగం మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నేను ఒకరి పేరు పిలుస్తా... లేచి నిలబడమనండి! రోజమ్మ లేదు, అంబటి లేడు... ఎవరూ లేరు... తిరోగమన దిశలో ఉన్నామని, ప్రజలు తమను తిరస్కరించారని, ఓటమి తప్పదని వాళ్లకు అర్థమైపోయింది. అందుకే నోటికొచ్చిన అభాండాలు వేస్తున్నారు.
లోకేశ్ కు ఈవీఎం వీడియో ఎలా వచ్చిందంటున్నారు.... లోకేశ్ కే కాదు సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ వీడియో వచ్చింది. సజ్జలా... నీ దగ్గర సెల్ ఫోన్ లేదా? ఆ వీడియో నీకు రాలేదా? మీ గౌరవనీయ పిన్నెల్లి గారు మందీ మార్బలంతో బూత్ లోకి వెళ్లడం, ఆ బూత్ లో అధికారులందరూ లేచి నిలబడి ఆయనను స్వాగతించడం, ఆయన సరాసరి ఈవీఎం వద్దకు వెళ్లి బద్దలు కొట్టడం, వీవీ ప్యాట్లు బయటపడడం వీడియోలో చూడలేదా?
ఆయన (పిన్నెల్లి) వీవీ ప్యాట్లు చూశాడు... 6 వైసీపీ, 22 టీడీపీ... దాంతో గంగవెర్రులెత్తిపోయాడు. అసలే కోతి... ఆపై కల్లు తాగింది, నిప్పు తొక్కింది... అదే ఆరోజు మిస్టర్ పిన్నెల్లి పరిస్థితి! ఆ ఘటన జరిగిన తర్వాత అక్కడున్న పోలీసులు అతడిని గౌరవంగా కారెక్కించి పంపిస్తారా? వాళ్లు మీరు నియమించిన పోలీసులు... ఇందులో చంద్రబాబుకు ఏం సంబంధం?
ఇవాళ నీ గతేంటి? పరారీలో ఉన్న నువ్వు పోలీస్ పేరు చెబితే తడుపుకుంటున్నావు... ఆ రోజున నీ పేరు చెబితే పోలీసులు తడుపుకున్నారు. ఇప్పుడు పోలీసుల పేరు చెబితే నువ్వు, నీ తమ్ముడు తడుపుకోవడంలేదా?
సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు అడుగుతున్నా... ఇంకా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ధైర్యం ఉందా నీకు? వైసీపీకి 144 సీట్లు వస్తాయని జగన్ లండన్ వెళుతూ ఈయనతో చెప్పాడంట... ఇంకా ఎవర్ని మోసం చేస్తారు?
పరిస్థితి అర్థం కావడంతో వైసీపీ నుంచి అందరూ జారిపోతున్నారు. కొన్నిచోట్ల కౌంటింగ్ కు వైసీపీ ఏజెంట్లుగా ఉండేందుకు ఎవరూ రావడంలేదు. అన్ని రోజులు ఒకలాగా ఉండవు. ప్రజలు తిరగబడ్డారు... దాని ఫలితం ఏంటో జూన్ 4న తెలుస్తుంది" అంటూ వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.