Madhya Pradesh: స్వరం మార్చి.. యువతులను ఏమార్చి ఏడుగురిపై అత్యాచారం!

Man Uses Voice Changing App To Pose As Woman Professor Rapes 7 Students
  • మధ్యప్రదేశ్ లో ఓ నిరక్షరాస్యుడి హైటెక్ కీచకపర్వం వెలుగులోకి
  • వాయిస్ మార్ఫింగ్ తో మహిళా టీచర్ లా మాట్లాడిన బ్రజేష్ కుష్వాహా
  • నిర్మానుష్య ప్రదేశానికి వస్తే స్కాలర్ షిప్ ఇప్పిస్తానని నమ్మించి ఆపై బలాత్కారం
  • ఎట్టకేలకు అరెస్టు చేసిన పోలీసులు.. నిందితుడి ఇల్లు బుల్డోజర్ తో నేలమట్టం
అతను ఓ నిరక్షరాస్యుడు. కానీ అతివలపై అఘాయిత్యానికి పాల్పడేందుకు మాత్రం హైటెక్ సాంకేతికతను ఉపయోగించాడు. ఏడుగురు అమాయక గిరిజన కాలేజీ యువతులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు అతని పాపం పండటంతో పోలీసులకు చిక్కాడు.

వాయిస్ చేంజింగ్ యాప్ ఉపయోగించి..
పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాకు చెందిన బ్రజేష్ కుష్వాహా ఓ మాజీ మిల్లు కార్మికుడు. తన ప్రాంతంలో నివసించే అమాయక గిరిజన కాలేజీ విద్యార్థినులపై కన్నేసి ఓ భారీ ప్లాన్ వేశాడు. వాయిస్ మార్ఫింగ్ యాప్ ఉపయోగించి తన స్వరాన్ని ఓ కాలేజీ మహిళా టీచర్ స్వరంలా మార్చి వారితో సెల్ ఫోన్లో మాట్లాడేవాడు. స్కాలర్ షిప్ ఇప్పిస్తానని.. ఇందుకోసం నిర్మానుష్యంగా ఉండే ప్రాంతానికి వెళ్తే అక్కడికి ఓ వ్యక్తిని పంపిస్తానని.. అతను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని తన (టీచర్) ఇంటికి తీసుకొస్తాడని నమ్మించేవాడు. అలా వారు బైక్ ఎక్కగానే సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి రేప్ చేసేవాడు. ఇప్పటివరకు అతను ఇలా ఏడుగురు యువతులపై అత్యాచారాలకు పాల్పడ్డాడు.

పట్టించిన క్లూ..
యువతులను కలిసేందుకు వెళ్లినప్పుడు నిందితుడు మొహం కనిపించకుండా హెల్మెట్ ధరించేవాడని అత్యాచార బాధితులు పోలీసులకు చెప్పారు. అయితే అతని చేతికి ఎప్పుడూ గ్లౌవ్స్ ఉండేవని వివరించారు. ఈ క్లూ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు కుష్వాహాను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఓ రోలింగ్ మిల్లులో పనిచేస్తున్నప్పుడు చేతులు కాలిపోవడంతో అతను గ్లౌజ్ లు ధరించి తిరుగుతున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అతనికి సహకరించిన మరో ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేశారు. మరోవైపు సిధి జిల్లా యంత్రాంగం అతని ఇంటిని బుల్డోజర్ తో నేలమట్టం చేసింది. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసినట్లు జిల్లా ఐజీ మహేంద్ర సికార్ వర్ తెలిపారు.


సిట్ దర్యాప్తునకు సీఎం ఆదేశం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఇంకెవరైనా బాధితులు ఉన్నారో లేదో దర్యాప్తు చేసేందుకు 9 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు ఆదేశించారు. దీంతో ఓ మహిళా డీఎస్పీ సారథ్యంలో సిట్ ఏర్పాటైంది. మరోవైపు వాయిస్ చేంజింగ్ యాప్ ల దుర్వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెల్ ప్రజలను అప్రమత్తం చేసింది.
Madhya Pradesh
Rape
Crime
Voice changing app
illiterate
Accused

More Telugu News