AC 3 Tier: టికెట్ లేని ప్రయాణికులతో కిక్కిరిసిన థర్డ్ ఏసీ బోగీ! వీడియో వైరల్

Viral Video Shows Ticketless Passengers Overcrowding AC 3 Coach Railways Responds
  • బ్రహ్మపుత్ర ఎక్స్ ప్రెస్ లో విపరీతమైన రద్దీ
  • బిహార్ లోని పాట్నా స్టేషన్ లో ఏసీ బోగీలోకి దూరిన జనరల్ ప్రయాణికులు
  • రిజర్వేషన్ పొందిన సీట్లలో కూర్చొనేందుకు నానా ఇబ్బంది పడ్డామన్న ఓ యువకుడు
  • థర్డ్ ఏసీలో దుస్థితిని తెలియజేస్తూ సోషల్ మీడియాలో వీడియో పెట్టిన వైనం
వేసవి రద్దీకి అనుగుణంగా తగినన్ని రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ బోగీల్లో చోటు లేక రిజర్వేషన్ బోగీల్లోకి కూడా ఎక్కేస్తున్నారు. తాజాగా బ్రహ్మపుత్ర ఎక్స్ ప్రెస్ లో ఇదే సీన్ కనిపించింది. థర్డ్ క్లాస్ ఏసీ బోగీలోకి చాలా మంది టికెట్ లేని ప్రయాణికులు ఎక్కేసి ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విజయ్ కుమార్ అనే ప్రయాణికుడు ఈ వీడియో తీసి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘పాట్నా జంక్షన్ లో నేను, నా కుటుంబ సభ్యులు రైలు ఎక్కేందుకు ఎంతో ఇబ్బంది పడ్డాం. మేం రిజర్వ్ చేసుకున్న సీట్లలో కూర్చొనేందుకు పోట్లాడాల్సి వచ్చింది. ఏసీ 3 టైర్ బోగీని అంతా జనరల్ టికెట్ ప్రయాణికులు ఆక్రమించారు. నిబంధనల గురించి పట్టించుకొనే వారెవరూ లేరు’ అంటూ ఆ వీడియో కింద కామెంట్ చేశాడు. తాము 8 టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నామని.. కానీ వేరే ప్రయాణికులు ఆక్రమించడంతో 6 సీట్లలో మాత్రమే కూర్చోగలిగామని చెప్పాడు. ఏసీ బోగీలో ఎక్కిన వారిలో కొందరు జనరల్ టికెట్లతో ప్రయాణిస్తుంటే మరికొందరు అసలు టికెట్లు లేకుండానే ఎక్కేశారని విజయ్ కుమార్ వివరించాడు.

దీనిపై రైల్వే శాఖకు చెందిన ప్రయాణికుల సహాయ సోషల్ మీడియా అధికారిక ఖాతా ‘రైల్వే సేవ’ స్పందించింది. పీఎన్ ఆర్ వివరాలు, మొబైల్ నంబర్ ను తమకు అందిస్తే తగిన సాయం చేస్తామని తెలిపింది. అలాగే ఫిర్యాదుల కోసం నేరుగా తమ వెబ్ సైట్ http://railmadad.indianrailways.gov.in ను సంప్రదించాలని సూచించింది. అలాగే సమస్యల సత్వర పరిష్కారానికి 139 నంబర్ కు డయల్ చేయాలని కోరింది. అయితే రైల్వే శాఖ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. 1990ల నుంచి బీహార్ లో దాదాపు ప్రతి రైల్లోనూ ఇదే దృశ్యం కనిపిస్తోందని ఓ యూజర్ ఎద్దేవా చేశాడు. అలాంటి ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని మరొకరు సూచించారు. రైల్వే శాఖపై వినియోగదారుల కోర్టును ఆశ్రయించి రూ. 10 లక్షల పరిహారం కోరాలని మరో యూజర్ చెప్పాడు. చట్టపరమైన చర్యలు తీసుకొనే వరకు రైల్వే అధికారులు ఏమాత్రం పట్టించుకోరని విమర్శించాడు.


AC 3 Tier
Brahmaputra Express
Indian Railways
General Ticket
Passengers
Overcrowd
Ticketless Passengers

More Telugu News