Fake Calls: ఫేక్ కాల్స్ పై టెలికాం ఆపరేటర్లకు కేంద్రం కీలక ఆదేశాలు

DoT issues orders Telecom Operators to black fake calls
  • విదేశాల్లో ఉంటూనే భారత నెంబర్లతో ఫోన్ చేసి ఏమార్చుతున్న మోసగాళ్లు
  • కాలింగ్ లైన్ ఐడెంటిటీ (సీఎల్ఐ) మార్చుతున్నారన్న కేంద్ర టెలికాం విభాగం
  • ఈ ఫేక్ కాల్స్ ను బ్లాక్ చేయాలని టెలికాం సంస్థలకు ఆదేశాలు
ఇటీవల కాలంలో విదేశాల్లోని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. కాలింగ్ లైన్ ఐడెంటిటీ (సీఎల్ఐ)ని మార్చడం ద్వారా భారత్ నుంచే కాల్స్ చేస్తున్నట్టు భ్రమింపజేస్తున్నారు. తద్వారా ఫేక్ కాల్స్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు విదేశాల నుంచి కాల్ చేస్తున్నప్పటికీ, అది భారతీయ మొబైల్ నెంబర్ లానే కనిపిస్తుంది. 

ఇలా స్థానిక ఫోన్ నెంబర్ల సాయంతో అంతర్జాతీయ ఫేక్ కాల్స్ చేస్తుండడం పట్ల కేంద్రం అప్రమత్తమైంది. ప్రముఖ టెలికాం సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతీయ మొబైల్ నెంబర్లతో వచ్చే అంతర్జాతీయ ఫేక్ కాల్స్ ను బ్లాక్ చేయాలని టెలికాం ఆపరేటర్లకు స్పష్టం చేసింది. 

స్థానిక నెంబర్ల సాయంతో అంతర్జాతీయ కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆర్థిక  మోసాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ రంగ టెలికాం విభాగం వెల్లడించింది. నేరగాళ్లు విదేశాల్లో ఉంటూనే సీఎల్ఐ మార్పుతో స్థానిక నెంబర్లను ఉపయోగించుకుని కాల్స్ చేయగలుగుతున్నారని... ప్రభుత్వ, పోలీసు అధికారులమని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించింది. వర్చువల్ కిడ్నాప్ లు, కొరియర్ లో డ్రగ్స్ పార్సిల్ మోసాలు, ఫెడెక్స్ స్కాంలకు పాల్పడుతున్నారని టెలికాం విభాగం తెలిపింది. 

ఈ క్రమంలో, తాము సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం సంస్థలతో కలిసి ఇలాంటి ఫేక్ కాల్స్ ను బ్లాక్ చేసేందుకు ఓ వ్యవస్థను రూపొందించామని, ఇప్పుడు ఆ వ్యవస్థను అమలు చేసేందుకే తాజా ఆదేశాలు ఇచ్చినట్టు కేంద్ర టెలికాం విభాగం స్పష్టం చేసింది. 

ఈ వ్యవస్థ ద్వారా... ఇప్పటికే ల్యాండ్ లైన్లకు వచ్చే ఫేక్ కాల్స్ ను సమర్థంగా కట్టడి చేశామని పేర్కొంది.
Fake Calls
DoT
Telecom Operators
CLI
India

More Telugu News