Pune Porsche accident: పూణె టీనేజర్ డ్రంకెన్ డ్రైవ్ కేసులో మరో మలుపు.. ఇద్దరు వైద్యుల అరెస్ట్

Latest twist in Pune accident case two doctors arrested
  • ఈ నెల 19న తాగి కారు నడుపుతూ ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఢీకొట్టిన టీనేజర్
  • వారిద్దరూ అక్కడికక్కడే మృతి
  • బాలుడి రక్త నమూనాలు తారుమారు చేసే ప్రయత్నం చేసిన వైద్యులు
  • అరెస్ట్ అయిన వారిలో ఒకరు ఫోరెన్సిక్ విభాగం హెడ్.. మరొకరు ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్
  • ఇప్పటికే అరెస్ట్ అయిన టీనేజర్ తండ్రి, తాత
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన పూణె టీనేజర్ డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇది మరో మలుపు. కేసును విచారిస్తున్న పోలీసులు నగరంలోని సాసూన్ జనరల్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ తర్వాత బాలుడి రక్త నమూనాలను మార్చినట్టు అభియోగాలు వారిపై నమోదయ్యాయి. అరెస్ట్ అయిన ఇద్దరు వైద్యుల్లో ఒకరు ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ అజయ్ టవేరే కాగా, మరొకరు ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ శ్రీహరి హర్నోర్. ప్రమాద సమయంలో బాలుడు మద్యం సేవించలేదని చెప్పేందుకు వీరిద్దరూ కలిసి బాలుడి రక్తనమూనాలను తారుమారు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

ఈ కేసును క్రైంబ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 19న బార్‌లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న బాలుడు తన ఖరీదైన పోర్షే కారులో తెల్లవారుజామున ఇంటికి వస్తూ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఘటనలో ప్రమాదం జరిగిన 14 గంటల్లోనే నిందితుడైన బాలుడికి బెయిలు మంజూరు చేసిన జువైనల్ కోర్టు.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుని జూన్ 5 వరకు అబ్జర్వేషన్‌కు పంపింది. ఈ కేసులో ఇప్పటికే టీనేజర్ తండ్రి, తాతను పోలీసులు అరెస్ట్ చేశారు.
Pune Porsche accident
Teenager
Doctors
Software Engineers
Crime News

More Telugu News