Maheshwar Reddy: పైరవీ చేసి పదవి తెచ్చుకోవడానికి మాది కాంగ్రెస్ పార్టీ కాదు: బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి

Maheshwar Reddy fires at Uttam Kumar Reddy for personal comments
  • తమ పార్టీ అధ్యక్షుడి అనుమతితోనే తాను సీఎంను కలిశానని వెల్లడి
  • పౌరసరఫరా శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపాటు 
పైరవీ చేసి బీజేపీ ఎల్పీ లీడర్ పదవిని తెచ్చుకోలేదని... అందరి సమన్వయంతో తనకు అవకాశం కల్పించారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్ష పదవిని ఎలా తెచ్చుకున్నారో మాకు తెలియదా? అని విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పైరవీ చేసి పదవి తెచ్చుకోవడానికి తమది కాంగ్రెస్ పార్టీ కాదన్నారు.

అయినప్పటికీ తాను వారిలా దిగజారి ఆరోపణలు చేయలేనన్నారు. తాను తమ అధ్యక్షుడి అనుమతితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు వెళ్లినట్లు చెప్పారు. ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు స్పందించని ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్‌పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే ఎంతగా అవినీతి జరుగుతోందో అర్థం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. పౌరసరఫరా శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాము 19 ప్రశ్నలతో లేఖ రాస్తే ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారని విమర్శించారు. తాను చేసిన ఆరోపణలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు.
Maheshwar Reddy
Uttam Kumar Reddy
Telangana
BJP

More Telugu News