Mamata Banerjee: జూన్ 1న 'ఇండియా' కూటమి సమావేశానికి హాజరు కావడం లేదు: మమతా బెనర్జీ
- ఎన్నికలు, ఫలితాలు, కూటమి భవిష్యత్తుపై చర్చించేందుకు ఢిల్లీలో కూటమి భేటీ
- అదే రోజున బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నందున వెళ్లలేమని స్పష్టం చేసిన తృణమూల్ కాంగ్రెస్
- మరో వైపు తుపాను సహాయ కార్యక్రమాలకే ప్రాధాన్యమన్న సీఎం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరిదశ పోలింగ్ జరగనున్న జూన్ 1న ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి భేటీ కానుంది. అయితే ఈ భేటీకి తాము హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో లోక్ సభ ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు, కూటమి భవిష్యత్తుపై చర్చించనున్నారు.
ఈ సమావేశంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ... జూన్ 1న ఇండియా కూటమి సమావేశం నిర్వహిస్తోందని తెలిపారు. కానీ బెంగాల్లో 9 లోక్ సభ స్థానాల్లో అదేరోజు ఎన్నికలు ఉన్నందున తాను ఢిల్లీ సమావేశం కోసం రాలేనని చెప్పానని వెల్లడించారు. పంజాబ్, బీహార్, ఉత్తర ప్రదేశ్‌లలో కూడా జూన్ 1న ఎన్నికలు ఉన్నాయని... అందుకే ఢిల్లీకి వెళ్లడం ఆచరణాత్మకం కాదన్నారు.
ఓ వైపు తుపాను... మరోవైపు ఎన్నికలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో తనకు తుపాను సహాయ కార్యక్రమాలే తనకు తొలి ప్రాధాన్యత అన్నారు. ఏడో దశలో తమకు చాలా కీలకమైన ఎన్నికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ రోజున కోల్‌కతా, గ్రేటర్ కోల్‌కతాలోని అన్ని స్థానాలకు పోలింగ్ ఉందని తెలిపారు. తమ పార్టీకి ఇది చాలా కీలకమని పేర్కొన్నారు.