Haryana: హర్యానాలో ఫ్లైఓవర్ ప్రమాదం.. ఊడిపడ్డ 700 మీటర్ల డ్రెయిన్ పైప్.. వాహనదారులకు తీవ్ర గాయాలు

Several injured after 700 m long drain pipe falls on vehicles in Haryanas Karnal

  • హర్యానాలోని కర్నాల్ లో జాతీయ రహదారి 44పై ఘటన
  • ధ్వంసమైన వాహనాలు.. భారీ పైప్ లైన్ కావడంతో పక్కకు జరపలేకపోయిన స్థానికులు
  • ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించిన పోలీసులు

హర్యానాలోని కర్నాల్ లో జాతీయ రహదారి 44పై మంగళవారం భారీ ప్రమాదం జరిగింది. పానిపట్–చండీగఢ్ హైవేపై ఉన్న ఓ ఎలివేటెడ్ హైవే (ఫ్లైఓవర్)కు అడుగు వైపున ఏర్పాటు చేసిన 700 మీటర్ల పొడవైన వర్షపునీటి డ్రెయిన్ పైప్ 50 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద వెళ్తున్న వాహనదారులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో వాహనదారులు తీవ్రంగా గాయపడ్డారు. చాలా వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ జాం ఏర్పడింది.

గాయపడ్డ వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా, ఆ భారీ ఇనుప పైప్ ను వారు పైకి లేపలేకపోయారు. చివరకు ప్రమాదవార్త అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

ఎలివేటెడ్ హైవేకు సమాంతరంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్ పాతది కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News