India Head Coach: టీమిండియా కోచ్ పదవి దరఖాస్తుకు ముగిసిన డెడ్ లైన్.. కొనసాగుతున్న ఉత్కంఠ

India Coach Application Deadline Ends No Top Foreign Names Apply VVS Laxman Not Interested

  • సోమవారంతో ముగిసిన డెడ్ లైన్ 
  • విదేశీ ప్లేయర్లు ఎవరూ దరఖాస్తు చేసుకోని వైనం
  • హెడ్ కోచ్ బాధ్యతలపై వీవీఎస్ లక్ష్మణ్ అనాసక్తి
  • తెరపైకి గౌతమ్ గంభీర్ పేరు, మౌనంగా బీసీసీఐ

టీమిండియా హెడ్ కోచ్ పదవికి డెడ్ లైన్ సోమవారంతో ముగిసింది. అయితే, రాహుల్ ద్రవిడ్ తరువాత టీంకు మార్గదర్శిగా నిలిచేది ఎవరన్న దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. కోచ్ పదవికి తొలుత పలువురు విదేశీ క్రికెట్ దిగ్గజాలు లైన్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఒకానొక దశలో ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

 అయితే, దేశీయంగా అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిని, స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న వారికోసమే తాము చూస్తున్నట్టు జై షా స్పష్టం చేయడంతో ఈ వార్తలకు ముగింపు పడింది. టీం ఇండియా హెడ్ కోచ్ గా దాదాపు 10 నెలలు టీం కోసం కేటాయించాలి. కుటుంబానికి దూరంగా ఉండాలి. ఈ నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చినా ఆయన కూడా తప్పుకున్నట్టు సమాచారం. 

మరోవైపు, ఐపీఎల్ ట్రోఫీతో తన సత్తా చాటిన గౌతమ్ గంభీర్ పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే, దీనిపై బీసీసీఐగానీ గంభీర్ గానీ ఇప్పటివరకూ స్పందించలేదు. గౌతమ్ కి మించిన ప్రత్యామ్నాయం ఏదీ ప్రస్తుతానికి అందుబాటులో లేదన్నది క్రీడా ప్రపంచంలో వినిపిస్తున్న మరోటాక్. 

మరోవైపు, కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్‌కు గౌతీతో ప్రత్యేక అనుబంధం ఉంది. కాబట్టి, కేకేఆర్ ను వీడటం గౌతీకి అంత ఈజీ కాదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు గౌతీ తగిన వాడన్న విషయంలో టీం సీనియర్ల అభిప్రాయం ఏమిటనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. 

‘‘డెడ్ లైన్ విషయంలో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కోచ్ ఎవరనేది నిర్ణయించేందుకు బీసీసీఐ కొంత సమయం తీసుకునే అవకాశం లేకపోలేదు. జూన్ నెల అంతా టీమిండియా ప్రపంచకప్‌ కు సిద్ధమవడంలో బిజీబిజీగా గడిపేస్తుంది. శ్రీలంక, జింబాబ్వే టూర్లకు సీనియర్లకు రెస్ట్ ఇస్తారు. ఈ టోర్నీలకు ఎన్‌సీఏలోని సీనియర్ కోచ్‌లు టీం వెంట ఉంటారు. కాబట్టి హెడ్ కోచ్‌ విషయంలో అంత తొందరపడాల్సిన అవసరం లేమీ లేదు’’ అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News