Arvind Kejriwal: ఒక్క నెలలో 7 కేజీలు తగ్గా, తీవ్ర అనారోగ్య సమస్య ఉండొచ్చు: అరవింద్ కేజ్రీవాల్
- బరువు బాగా తగ్గానని, కీటోన్ బాడీస్ స్థాయులు అధికంగా ఉన్నాయన్న కేజ్రీవాల్
- వైద్య పరీక్షల నిమిత్తం మరో 7 రోజుల పొడిగింపు కోరుతూ సుప్రీంలో పిటిషన్
- వైద్య పరీక్షల తరువాతే సమస్య ఏమిటనేది తెలుస్తుందన్న ఢిల్లీ సీఎం
- జూన్ 1తో ముగియనున్న కేజ్రీవాల్ బెయిల్ గడువు
తాను ఒకే నెలలో 7 కేజీలు తగ్గానని ఇది ఆందోళనకరమని ఆఫ్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకేదైనా తీవ్ర అనారోగ్యం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్ పొడిగింపు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. ఈ మేరకు సోమవారం పత్రికా సమావేశంలో మాట్లాడారు.
‘‘నా బరువు చాలా తగ్గింది. ఒక నెలలో అకారణంగా ఏడు కేజీల బరువు తగ్గినట్టైతే ఏదైనా సీరియస్ సమస్య ఉన్నట్టు అనుమానించాలి. డాక్టర్లు నాకు కొన్ని వైద్య పరీక్షలు సూచించారు. ఇందుకు ఏడు రోజులు పడుతుందని అన్నారు’’ అని కేజ్రీవాల్ కోరారు. జూన్ 1తో ఆయన బెయిల్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మరో ఏడు రోజుల గడువు పొడిగింపు కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. ఏదైనా తీవ్ర సమస్య ఉన్నదీ లేనిదీ టెస్టుల తరువాతే తెలుస్తుందని వైద్యులు చెప్పినట్టు కేజ్రీవాల్ మీడియాతో అన్నారు.
కేజ్రీవాల్ రక్తంలో కీటోన్ బాడీలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఆప్ మరో ప్రకటనలో తెలిపింది. పీఈటీ-సీటీ స్కాన్ తోపాటు కేజ్రీవాల్ అనేక ఇతర వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని పేర్కొంది.
కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి మే 10న విడుదలైన విషయం తెలిసిందే. జూన్ 1 వరకూ ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. అయితే, జైలు నుంచి బయటకు వచ్చాక కేజ్రీవాల్ ఇండియా కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.