KTR: సీఎం గారూ, ఇదెక్కడి మూర్ఖత్వం... కాకతీయ తోరణంపై కోపమెందుకు?: రేవంత్ రెడ్డికి కేటీఆర్ ప్రశ్న
- కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నం రాచరిక గుర్తులు కాదన్న కేటీఆర్
- చార్మినార్ అంటే.. విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్కు ఐకాన్ అన్న కేటీఆర్
- కాకతీయ కళాతోరణం అంటే.. సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకమని వివరణ
- అధికారిక చిహ్నం నుంచి వీటి తొలగింపు తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమేనన్న కేటీఆర్
'ముఖ్యమంత్రి గారూ... ఇదేం రెండు నాల్కల ధోరణి... ఇదెక్కడి మూర్ఖత్వం.. కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం? చార్మినార్ చిహ్నంపై ఎందుకంత చిరాకు?' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో కాకతీయ తోరణం, చార్మినార్ చిహ్నం తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
'అవి రాచరికపు గుర్తులు కాదు..!
వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు..!!
వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు..!!!
జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ?
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే.. చార్మినార్
అధికారిక గీతంలో కీర్తించి..!!
అధికారిక చిహ్నంలో మాత్రం అవమానిస్తారా..??
చార్మినార్ అంటే.. ఒక కట్టడం కాదు..
విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్కు ఐకాన్
కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదు..
సిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం..
తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి..
వీటిని తొలగించడం అంటే.. తెలంగాణ చరిత్రను చెరిపేయడమే..!
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే..!!
మీ కాంగ్రెస్ పాలిస్తున్న...
కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి..
మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి..??
భారత జాతీయ చిహ్నంలోనూ..
అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి..
జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది..
వాటి సంగతేంటో సమాధానం ఇవ్వండి..??
కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ?
ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ?
ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు..
రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ చెరిపేస్తారా..?
గత పదేళ్లుగా..
ప్రభుత్వ అధికారిక చిహ్నంపై..
యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది..
సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది..
రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో..
రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించం
పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా...
మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం..!
తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం..!!' అని పేర్కొన్నారు.