Rahul Gandhi: ఓ వ్యాపారవేత్తకు సాయం చేసేందుకే మోదీని దేవుడు పంపారేమో: రాహుల్ గాంధీ వ్యంగ్యం
- ఓ లక్ష్యం కోసం దేవుడు తనను పంపించాడన్న ప్రధాని మోదీ
- తనను తాను దేవుడికి అంకితం చేసుకుంటున్నానని వెల్లడి
- మోదీ దేశంలో 22 మంది బిలియనీర్లను తయారుచేశారని రాహుల్ విమర్శలు
- తాము కోట్లాదిమందిని లక్షాధికారులుగా చేస్తామని హామీ
ఓ లక్ష్యం కోసం తనను ఆ దేవుడే పంపాడని, తనను తాను దేవుడికి అంకితం చేసుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇంటర్వ్యూల్లో చెబుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యం ప్రదర్శించారు. పేదలకు కాకుండా, ఓ బిజినెస్ మేన్ కు సాయపడేందుకే మోదీని దేవుడు పంపి ఉంటారని ఎద్దేవా చేశారు.
మోదీ దేశంలో 22 మంది బిలియనీర్లను తయారుచేశారని, వారికి సంబంధించి రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో మోదీని జాతి ఎప్పటికీ క్షమించబోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కోట్లాది మందిని లక్షాధికారుల స్థాయికి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇవాళ ఇండియా కూటమి సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, జూన్ 4 తర్వాత మోదీ ప్రధాని కాబోరని, ఇది తన హామీ అని అన్నారు. వారణాసిలో కాంగ్రెస్ బలపరిచిన అజయ్ రాయ్ విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండబోతోందని అభిప్రాయపడ్డారు. ఈ సభలో సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో దశ జూన్ 1న జరగనుండగా, ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో కూడా ఆ విడతలోనే పోలింగ్ జరగనుంది.