ACB Raids: లారీ డ్రైవర్లలా అశ్వారావుపేట ఆర్టీఏ కార్యాలయానికి ఏసీబీ అధికారులు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రైవేటు వ్యక్తులు
- తెలంగాణ ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల తిష్ట
- రాష్ట్రవ్యాప్తంగా ఏక కాలంలో 15 చోట్ల ఏసీబీ దాడులు
- పట్టుబడిన 2,70,510 రూపాయలు
- అధికారులు తనిఖీల్లో ఉండగానే లంచం తెచ్చి ఇస్తున్న లారీ డ్రైవర్లు
తెలంగాణలో ఆర్టీఏ కార్యాలయాలు ప్రైవేటు వ్యక్తులకు అడ్డాగా ఎలా మారుతున్నాయో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అధికారుల సీట్లనే ఆక్రమించి వాహనదారుల నుంచి దర్జాగా లంచాలు వసూలు చేస్తున్న వారి ఆటకట్టించారు ఏసీబీ అధికారులు. లారీ డ్రైవర్లలా వేషం మార్చుకుని వచ్చిన ఏసీబీ అధికారుల వద్ద లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ప్రాంతీయ రవాణా సంస్థ (ఆర్టీఏ) కార్యాలయాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న సమాచారంతో నిన్న ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం 15 బృందాలుగా విడిపోయి 12 ఆర్టీఏ కేంద్రాలతోపాటు మూడు తనిఖీ కేంద్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కేంద్రాల్లో అక్రమాలు బయటపడ్డాయి. లెక్కల్లో లేని రూ. 2,70,510 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కో లారీకి ఒక్కో రేటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శివారులోని అంతర్రాష్ట్ర సరిహద్దులోని రవాణాశాఖ తనిఖీ కేంద్రంలో ప్రైవేటు వ్యక్తులు తిష్టవేశారు. లారీ డ్రైవర్లలా వచ్చిన ఏసీబీ అధికారులను గుర్తించని ప్రైవేటు వ్యక్తులు.. 12 చక్రాల లారీకి రూ. 200, 16 చక్రాల లారీకి రూ. 400, 22 చక్రాల లారీకి రూ. 800గా రేటు చెబుతూ లారీని బట్టి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆపై మూమూళ్లు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టారు.
మరోవైపు, కేంద్రంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే కొందరు లారీ డ్రైవర్లు మామూళ్లు తెచ్చి ఇచ్చారు. తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులను చూసి వారు కూడా లారీ డ్రైవర్లేనని భ్రమపడి వారి ఎదురుగానే లంచాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీ చేసిన దాదాపు అన్ని కార్యాలయాల్లోనూ ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తూ వసూళ్లు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.