Prince Edward Island Province: కెనడాలో విదేశీ ఉద్యోగులపై ఉక్కుపాదం.. భారతీయుల నిరాహార దీక్ష

Indian workers facing deportation in Canada to go on full hunger strike
  • విదేశీ ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకు ప్రిన్స్ అడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్ ప్రయత్నాలు
  • అధిక జనాభాతో నివాసాల కొరత, ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని వివరణ
  • తాజా మార్పులతో స్వదేశానికి తిరిగి రావాల్సిన స్థితిలో భారతీయులు 
  • ఇప్పటికే ప్రావిన్స్‌లో ఉన్న వారికి మినహాయింపు కోరుతూ నిరాహార దీక్ష
కెనడాలోని ప్రిన్స్ అడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్ (రాష్ట్రం) ప్రభుత్వం విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు నిర్ణయించడంతో భారతీయులు చిక్కుల్లో పడ్డారు. ఉద్యోగం కోల్పోతే భారత్ కు తిరిగెళ్లాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న అనేక మంది భారతీయులు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. తమ వీసాలను పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. చార్లెట్ టౌన్ లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇకపై సంపూర్ణ నిరాహార దీక్షకు దిగుతున్నట్టు మంగళవారం ఎన్నారైలు ప్రకటించారు. కనీసం ద్రవాహారం కూడా ముట్టమని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఇప్పటికే 50 మంది వర్కర్లు కెనడా వీడినట్టు నిరసన కారుల్లో ఒకరు తెలిపారు. అధికారుల నుంచి వేధింపులు కూడా ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. 

వలసల నిబంధనల్లో ప్రభుత్వం అకస్మాత్తుగా మార్పులు చేసిందని జస్ప్రీత్ సింగ్ సివియా అనే నిరసనకారుడు తెలిపారు. శాశ్వత నివాసార్హత పొందే దశలో ఉన్న వారు కూడా ఈ మార్పులతో ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోతే నిరసనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

విదేశీ ఉద్యోగుల సంఖ్య 2100 నుంచి 1600లకు కుదించబోతున్నట్టు స్థానిక ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. హాస్పిటాలిటీ రంగంలో కోతలు విధించనున్నారు. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేశారు. అంతేకాకుండా, కొత్తగా శాశ్వతనివాసార్హత పొందేవారి సంఖ్యను 25 శాతం మేర తగ్గిస్తామని ఫిబ్రవరిలోనే స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం నామినేట్ చేసే సేల్స్ అండ్ సర్వీస్ వర్కర్ల సంఖ్యను కూడా 800 నుంచి 200కు కుదించింది. 

విదేశీ ఉద్యోగుల తగ్గింపు నుంచి నిర్మాణం, హెల్త్ కేర్ రంగాలకు కొంత మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా తగ్గించేందుకు వలసల కట్టడి తప్పదని పేర్కొంది. అధిక జనాభా కారణంగా నివాస సముదాయాలకు కొరత ఏర్పడిందని పేర్కొంది. ఆరోగ్య వ్యవస్థపై కూడా ఒత్తిడి పెరిగిందని వివరించింది. ఈ నేపథ్యంలో అనేక మంది విదేశీయులు మే 9 నుంచి నిరసనలకు దిగారు. ఇప్పటికే స్థానికంగా ఉంటున్న వారికి మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అకస్మాత్తు మార్పులతో కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, సేవాలోపం తలెత్తుతుందని హెచ్చరించారు.
Prince Edward Island Province
Canada
Deportation
Immigration
Indians on Hunger strike

More Telugu News