Balka Suman: రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడలు ఉండకూడదన్న సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ కౌంటర్
- అశోక చక్రాన్ని మొదట వాడిన నెహ్రూది కూడా రాచరికమేనా? అని ప్రశ్న
- ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన బాల్క సుమన్
- చోళరాజులు తయారు చేసిన సెంగోల్‌ను అధికారిక చిహ్నంగా స్వీకరించారని గుర్తు చేసిన సుమన్
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రాచరికపు పోకడలు ఉండకూడదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కౌంటర్ ఇచ్చారు. కాకతీయ స్థూపం, చార్మినార్ రాచరిక పోకడలకు నిదర్శనమంటూ వాటిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో బాల్క సుమన్ ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'అశోక చక్రాన్ని మొదట వాడిన నెహ్రూది కూడా రాచరికమేనా?' అని ప్రశ్నించారు.
ఈ మేరకు నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనాన్ని పొందుపరిచారు. సారనాథ్‌లో అశోక చక్రవర్తి వేసిన స్థూపంలో ఉన్న నాలుగు సింహాలను, అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంగా ఎంపిక చేసింది భారత రాజ్యాంగ సభ, తొలి ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేత నెహ్రూనే అని ఆ కథనంలో పేర్కొన్నారు. తమిళనాడులో చోళ రాజులు తయారు చేసిన సెంగోల్‌ను అధికారిక చిహ్నంగా స్వీకరించి... పార్లమెంట్ భవనంలో ప్రస్తుత భారత ప్రధాని మోదీ ప్రతిష్ఠించారని ఆ కథనం పేర్కొంది.