Arvind Kejriwal: కాంగ్రెస్తో పర్మినెంట్ పెళ్లేమీ కాలేదు!: పొత్తుపై అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్య
- ప్రస్తుతానికి బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమన్న కేజ్రీవాల్
- ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని పునరుద్ఘాటన
- బీజేపీ గెలిస్తే యోగి ఆదిత్యనాథ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తు శాశ్వతం కాదని... లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు మాత్రమే తాము ఒక్కటయ్యామన్నారు. బుధవారం 'ఇండియా టుడే' రాజ్ దీప్ సర్దేశాయ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
'ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్తో పర్మినెంట్ పెళ్లేమీ జరగలేదు. ప్రస్తుతానికి బీజేపీని ఓడించడమే మా లక్ష్యం. ప్రస్తుతం నియంతృత్వం, గూండాగిరిని అంతం చేయడమే మా పాలన లక్ష్యం' అన్నారు. ఢిల్లీలో 7 లోక్ సభ స్థానాల్లోనే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. పంజాబ్లో మాత్రం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థులుగా బరిలోకి దిగాయని గుర్తు చేశారు. పంజాబ్లో బీజేపీకి ఎలాగూ మనుగడ లేదన్నారు.
రాజీనామా చేసే ప్రసక్తి లేదు
మద్యం పాలసీ కేసులోని మనీ లాండరింగ్ వ్యవహారంలో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. అయితే తాను సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ మాత్రమే కోరుకుంటోందన్నారు. బీజేపీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే మాత్రం దేశంలో ప్రముఖ రాజకీయ నేతలంతా జైళ్లలోకి వెళ్లడం ఖాయమన్నారు. ఇంకా చెప్పాలంటే పుతిన్ సారథ్యంలో రష్యాలో పరిస్థితి ఎలా ఉందో.. దాదాపు అదే పరిస్థితి భారత్లో వస్తుందన్నారు.
తమ పార్టీకి చెందిన నేతలు సత్యంద్ర జైన్, మనీష్ సిసోడియాలు బీజేపీలో చేరితే వెంటనే బెయిల్ వస్తుందని... బీజేపీ నేతల నుంచి సందేశాలు వెళ్లినట్లు తన వద్ద సమాచారం ఉందన్నారు. స్వాతి మాలివాల్ ఘటనపై స్పందించేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితం ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. అమిత్ షా ప్రధాని కావడం ఖాయమన్నారు.