Monsoon: చల్లటి కబురు.. మూడు నాలుగు రోజుల్లో ఏపీకి తొలకరి పలకరింపు

Monsoon to enter into andhrapradesh in three to four days says IMD
  • నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
  • అంచనా వేసిన భారత వాతావరణ కేంద్రం
  • జూన్‌ తొలి వారంలో ఏపీలోకి ప్రవేశం!
తొలకరి పలకరింపు కోసం ఎదురుచూస్తున్న దేశవాసులకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు నేడు (గురువారం) కేరళను తాకనున్నాయని అంచనా వేసింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయని తెలిపింది. కాగా రానున్న మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

నిప్పుల కుంపటిని తలపిస్తోన్న ఏపీ
తీవ్రమైన ఎండలతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ‘రెమాల్‌ తుపాను’ అనంతరం గత రెండు రోజులుగా రాష్ట్రం మండిపోతోంది. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా భారీగా నమోదవుతున్నాయి.రాష్ట్రంలో బుధవారం అత్యధికంగా ఒంగోలులో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తక్కువగా అనిపిస్తున్నా తేమ కారణంగా ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. 

నేడు మరింతగా ఎండలు..
ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవ్వొచ్చని పేర్కొంది. ఇక శుక్రవారం పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
Monsoon
IMD
Weather
Weather Report
Andhra Pradesh
Kerala
rains

More Telugu News