Gangs of Godavari: ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణపై నెటిజన్ల ఆగ్రహం
- ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటి అంజలిని పక్కకు నెట్టడంపై ధ్వజం
- ఇది మహిళలను అవమానించడమేనని మండిపాటు
- ఈ తరహా చర్యలు ఎంతమాత్రం ఆమోదనీయయోగ్యం కాదని వ్యాఖ్య
టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నారు.
అసలు ఏం జరిగిందంటే..
హీరో విష్వక్సేన్ తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో హీరోయిన్లుగా నేహాశెట్టి, అంజలి నటించారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ‘నటసింహం’ బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం చివర్లో ఫొటోలకు పోజులిచ్చేందుకు బాలయ్యతోపాటు చిత్ర నటీనటులు, ఇతరులు సభా వేదికపైకి చేరుకున్నారు.
ఈ క్రమంలో బాలకృష్ణ తన పక్కన నిలుచున్న హీరోయిన్లు నేహాశెట్టితోపాటు అంజలిని కాస్త జరగాలన్నట్లుగా చేయి చూపించారు. అయితే అంజలి ఆయన సూచించినట్లుగా పక్కకు జరగకపోవడంతో చేత్తో ఒక్కసారిగా ఆమెను పక్కకు నెట్టారు. దీంతో అంజలి కాస్త తడబడినా బాలయ్య చర్యను స్పోర్టివ్ గా తీసుకుంది. నవ్వుతూనే ఫొటోలకు పోజులిచ్చింది. ఆమె పక్కన నిలబడిన నేహాశెట్టి మాత్రం కాస్త అవాక్కయినట్లుగా కనిపించింది. ఆ సమయంలో బాలకృష్ణ ఆమెతో ఏం మాట్లాడారో తెలియనప్పటికీ అంజలి మాత్రం నవ్వుతూనే ప్రతిస్పందించింది.
ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బాలయ్య తీరును కడిగిపారేస్తున్నారు. బాలకృష్ణ ప్రవర్తన మహిళలను అగౌరవపరిచేదిగా ఉందని విమర్శిస్తున్నారు.
నెటిజన్ల స్పందన ఇదీ..
‘బాలకృష్ణ ప్రవర్తన దారుణం. ఆ పరిస్థితుల్లో ఓ జూనియర్ నటి నవ్వుతూ ప్రతిస్పందించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత దాడి జరిగినా దాన్ని సమ్మతిస్తున్నట్లుగా అరుపులు, కేకలతో ప్రేక్షకులు స్పందించడం అత్యంత భయానకం’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు స్పందిస్తూ ‘ప్రతిభగల నటితో ఇలా ప్రవర్తించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని పోస్ట్ చేశాడు.
‘ఇది ఎంతో అవమానకరం. ఆయనకు ఎంత పొగరు’ అంటూ మరో యూజర్ విమర్శించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘అతిగా ఊహించుకుంటూ ఓవర్ యాక్షన్ చేసే నటుడు. ఆయన ఏ సినిమాలోనూ బాగోడు’ అని మరో యూజర్ మండిపడ్డాడు.
‘50కిపైగా సినిమాల్లో ఆమె నటించింది. అందులో దాదాపు సగం సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. సినీ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి నెలకొనడం బాధాకరం. దీన్ని ఎవరూ మార్చలేకపోవడం మరింతగా బాధిస్తోంది. ఈ వ్యవహారాన్ని తిమ్మిని బమ్మిని చేసేందుకు ‘పీఆర్’ రంగంలోకి దిగినా ఆశ్చర్యపోను’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. కాగా, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ శుక్రవారం విడుదల కానుంది.